రాక్షసులు అంటూ వేరే ఉండరు, మనలోనే ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" రాక్షసఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 318 వ నామం.
" రాక్షసఘ్నీ " అంటే రాక్షసులను సంహరించువారు అని భాష్యం చెప్పారు.
రాక్షసులు అని వేరే జీవులు ఉండరు. మనకు తెలిసిన దేవతలకు రాక్షసులకు తండ్రి ఒకరే. స్వభావాలను బట్టి అలా పిలుస్తూంటాం. అధర్మపరులు అంటే ధర్మానికి హాని చేసేవారు, సమాజానికి, ప్రకృతికి చేటు చేసేవారిని రాక్షసులు అంటాం. అటువంటి వారిని కట్టడి చేస్తారు అమ్మవారు. అటువంటి వారు సమాజంలో ఆనందంగా తిరగడం చూసి అమ్మవారు పట్టించుకోవడం లేదు అనుకుంటాం. తప్పు. వారు కూడా మారడానికి అవకాశం ఇస్తారు అమ్మవారు. ఇక లాభంలేదు అన్నప్పుడే శిక్షిస్తారు. భయంకరమయిన శిక్షల పాలయిన వారిని చూస్తూంటాం కూడా.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" దంభో దర్పో2భిమానశ్చ
క్రోధః పారుష్యమేవ చ,
అజ్ఞానం చాభిజాతస్య
పార్ధ సంపదమాసురీం "
- భ.గీత 16:4
" ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు " అని.
దూర్వాసులు శివాంశ సంభూతుడు. దురహంకారంతో విష్ణుభక్తుడు అంబరీషుడిని శపించారు. దానికి తగిన శిక్ష అనుభవించారు.
ఇటువంటి గుణములు ఉన్నవారికి ఆలస్యమయినా శిక్ష మాత్రం తప్పదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment