కోరిక ధర్మబద్ధంగా ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" దుష్టదూరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 193 వ నామం .
" దుష్టదూరా " అంటే దోషము కలవారిచే పొందశక్యము కానిది. అంటే కల్మషము లేని వారినే అమ్మవారు అనుగ్రహిస్తారు అని.
వామన పురాణం/యోగవాశిష్ఠరామాయణం ఏమి తెలియచేస్తున్నాయి అంటే " చిన్మాత్రం అమలం శాంతం - నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం వలన మాత్రమే శివుడిని తెలుసుకోగలుగుతారు " అని. మనస్సు శుద్ధంగా ఉండాలి.
వేదాలలో " అభిచారమంత్రాలు " ఉన్నాయి. శతృవు కొంచెం బలవంతుడయినప్పుడు శతృవు నాశనాన్ని కోరుతూ ఈ మంత్రాలని ఉపయోగించి హోమం చేస్తారు. వేదమే చెప్పింది కనుక అది ధర్మమే.
సతీదేవి ఆత్మార్పణం చేసుకున్నప్పుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి రుద్రగణాలు వచ్చినప్పుడు దక్షయజ్ఞం చేయిస్తూన్న భృగుమహర్షి ఈ అభిచారహోమం చేసి ఋభుగణాలను సృష్టించారు. వారు రుద్రగణాలను తరిమేశారు.
త్వష్టప్రజాపతి తన కుమారుడిని ఇంద్రుడు అన్యాయంగా చంపేసాడని బాధపడి ఇంద్రుడిని చంపే వీరుడు కావాలని కోరుతూ ఈ అభిచారహోమం చేసారు. వృత్రాసుర జననం జరిగింది.
అలా అమ్మవారు అనుగ్రహించారు.
ఇదే హోమం " నికుంభలా యాగం " ని ఇంద్రజిత్తు రాముడి మీద జయం కలగాలని కోరుతూ ప్రారంభించాడు. ఈ యాగాన్ని అతను చాలా సార్లు చేయడం, అమ్మవారి అనుగ్రహం పొందడం, ఇంద్రుడిని ఓడించి ఇంద్రజిత్ అని పేరు పొందడం కూడా జరిగింది. కాని ఇప్పటి పరిస్థితి ఏమిటి. ఓ వివాహిత అయిన పరస్త్రీని అపహరించిన రావణుడి జయం కోసం చేస్తూన్న యాగం ఇది. పైగా ఎవరి భార్యను అపహరించాడో అతని మీద జయం కోసం.
ఇది ధర్మబద్ధం కాదు. దోషభూయిష్టం అయినది. మరి అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు. అందుకే ఆ యాగం మధ్యలోనే భగ్నమవడం, ఇంద్రజిత్తు మరణించడం జరిగింది.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment