గోపికల భక్తి అనన్యభక్తి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అపరం భవతో జన్మ
పరం జన్మ వివస్వతః,
కధమేతద్విజానీయాం
త్వమాదౌ ప్రోక్తవా నితి "
- భ.గీత 4: 4.
" నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటీ అని ఆశ్చర్యంగా ఉంది. నీ జన్మ ఈమధ్యటిది. సూర్యుడు సనాతనుడు. ఎలా నమ్మేది " అంటాడు అర్జునుడు పరమాత్మతో.
గీతోపదేశం చేస్తూ పరమాత్మ అర్జునుడితో " ఈ ఉత్తమమయిన యోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు. నువ్వు నాకు మిత్రుడవు, భక్తుడవు కనుక నీకు మళ్ళీ చెబుతున్నాను " అంటారు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి పైవిధంగా అడుగుతాడు.
ఇక్కడ గమనించ వలసినది అర్జునుడు అనన్యభక్తుడు కాదు, కేవలం భక్తుడే. భక్తుడికి అనన్యభక్తుడికి తేడా ఉంటుంది.
విద్యాభ్యాసం పూర్తిచేసుకుని మథురకు తిరిగివచ్చిన కృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి బృందావనం వెళ్ళమన్నారు. దేనికో, ఏమి చేయాలో చెప్పనేలేదు. ఉద్దవుడు అడగనూ లేదు. బృందావనం వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చీకటి పడిపోయింది. పడుక్కుని తెల్లవారుఝామున లేచాడు.
ఎక్కడో ఒకావిడ చల్ల చిలుకుతూన్న చప్పుడుతో బాటు " తెల్లవారవస్తూంది లే కృష్ణా " అంటూ కృష్ణగానం వినబడింది. స్నానం చేసి బయటకు వచ్చారు. ఓ ఇంట్లో కృష్ణగానం చేస్తూ పిల్లవాడికి స్నానం చేయిస్తూంది ఒకావిడ. కొంచెం ముందరకు వెళ్ళేటప్పటికి ఒకావిడ కృష్ణగానం చేస్తూ పిల్లవాడికి తినిపిస్తూంది.
ఆశ్చర్యపోయాడు ఉద్దవుడు. ఈ గోపికలకు పిల్లవాడిని లేపుతూ కృష్ణుడిని లేపుతూన్నట్లు భావిస్తున్నారు. కృష్ణుడికి స్నానం చేయిస్తూన్నట్లు, కృష్ణుడికి తినిపిస్తూన్నట్లు భావిస్తున్నారు. వీరికి ఎప్పుడూ కృష్ణుడి ధ్యాసేనా. కర్మలన్నీ చేస్తున్నారు కాని అన్నీ కృష్ణుడి భావనతోనే. ఇదేనా అనన్యభక్తి అంటే. ఇది తెలుకోమనేనా నన్ను బృందావనంకి పంపారు కృష్ణుడు అని ఆశ్చర్యపోతాడు.
గోపికాస్త్రీల పాదధూళిని తీసుకుని నుదుట ధరిస్తాడు. బృందావనంలో పూలమొక్కలు, తీగలుగా పుట్టినా ఈ గోపికల పాదధూళి రేణువులు రోజూ తనపై పడేవి కదా అని కన్నీరు కారుస్తాడు.
అర్జునుడు ఎలా నమ్మమంటావు అన్నాడు. ఉద్దవుడు ఎందుకు వెళ్ళమంటున్నారు బృందావనంకి అని అడగనేలేదు. అదీ తేడా.
ఉద్దవుడు అనన్యభక్తుడు. అలా అనుగ్రహిస్తారు పరమాత్మ తనను నమ్ముకున్న వారిని.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment