వ్యాసర్షి గానయోగం ఉండాలన్నారు పాట వినడానికి కూడా - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" గానలోలుపా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 857 నామం.
" గానలోలుపా " అన్నది ఒక అద్భుతనామం. గానమునందు ఆసక్తి కలది అని అర్ధం. ఆవిడకు గానం అన్నా, గానం చేసేవారన్నా ఎంతో ఇష్టం. ఆవిడ నాదస్వరూపిణి. " నాదరూపాయైనమః " అని పూజిస్తారు అమ్మవారిని.
గానం అంటే " ఆనందానుభూతితో చేసే వ్యక్తీకరణ " అని వేదాలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారి ఏ స్తుతినైనా రాగయుక్తంగా ఛందోబద్ధంగా పాడుతారు.
" గాతారం త్రాయతే ఇతి గాయత్రి " అన్నాయి ఉపనిషత్తులు. గానం చేసేవారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అన్నారు. కేవలం గానంతో త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామిదీక్షితులు, అన్నమయ్య మొ గు వారు ధన్యజీవులయ్యారు, నేటికీ కీర్తింపబడుతున్నారు.
వ్యాసమహర్షి " గానయోగం " అని ఒక అద్భుతపదాన్ని వాడారు:
" గానయోగేనయోనిత్యం
పూజయంతి జనార్దనం,
తానానయతి భద్రంవో
యది దేవత్వమిచ్ఛతా "
అంటే గానయోగంతో దైవత్వం పొందుతారు అని. ఈ గానయోగం గానం చేసేవారిదే కాదు, విన్నవారిది కూడా.
పూజ అవగానే " గీతం శ్రావయామి " అంటారు. అమ్మవారు పాటతో మురిసిపోతుంది. శ్రావ్యమైన గొంతు ఉన్నవారెవరో పాడుతారు. అది అమ్మవారితోపాటు అక్కడ ఉండి " శ్రద్ధ " గా విన్నవారందరూ ఆనందిస్తారు.
త్యాగరాజస్వామి " సామగానలోల మనసిజ లావణ్య ధన్యముర్ధన్యులు , ఎందరోమహానుభావులు " అని కీర్తించారు.
అన్నమయ్య " చాలదా బ్రహ్మమిది సంకీర్తనము, మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం " అని కీర్తిస్తారు. ఈ కీర్తనలో ఆయన " సంతోషం కలుగుతుంది, సంతాపం తొలగుతుంది, జంతువులు ఆనందిస్తాయి " అంటారు. అంటే ఈ ప్రయోజనాలన్నీ పాడేవారికి, పాట " శ్రద్ధ " గా విన్నవారికీ కూడా కలుగుతాయని తెలుసుకోవాలి. స్వరము రాగము నాదము అన్నీ అద్భుతమే. అందుకే " భావం " తెలియకపోయినా మంచి కీర్తన వింటే మనస్సు ప్రశాంతత పొందుతుంది.
ధృవుడు చిన్న పిల్లవాడు. నారదమహర్షి ఉపదేశించిన " ఓం నమోభగవతే వాసుదేవాయ " మహా మంత్రాన్ని జపిస్తూ తపస్సుచేస్తే నారాయణుడు ప్రత్యక్షమయేరు. ధృవుడు ఆ దివ్యమంగళరూపాన్ని చూసి మూగబోయాడు. ఆనందాన్ని వ్యక్తపరచలేక చూస్తూ ఉండిపోతే నారాయణుడు గానరూపమైన శంఖాన్ని తాకించాడు ధృవుడికి. అంతే అమితానందం గానరూపంలో బయటకు వచ్చింది. నారాయణుడు ముగ్ధుడయి " చిరంజీవి " ని చేసాడు ధృవుణ్ణి.
ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏమిటంటే గానం ఇచ్చేది అమ్మవారే, గానం ఆవిడే, గానాన్ని ఆనందించేదీ ( మనలో ఉన్న ) ఆవిడే. అంతటా అమ్మ చైతన్యమే.
గానయుక్తంగా స్తుతించేలా, ఎల్లవేళలా " ఆనందంగా " ఉంటూ, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉండేలా అనుగ్రహించమని " గానలోలుప " స్వరూపిణి అయిన అమ్మవారిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment