మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి, ఉచ్ఛారణ బాగుండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" వ్యాహృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 421 వ నామం .

" వ్యాహృతిః " అంటే ఉచ్ఛారణ రూపమయినది. ఉచ్ఛారణే అమ్మవారు. అందుకే మాట్లాడేటప్పుడు మృదువుగా ఎదుటివారికి సులువుగా అర్ధమయేంతటి స్పష్టత ఉండాలి. వాక్కు స్పష్టంగా ఉంటే వినడానికి ఇంపుగా ఉంటుంది. 

వాయుపురాణమందు " నాచే బ్రహ్మచే మొదట ఉచ్ఛరింపబడిన దానివై వచ్చితివి కావున వ్యాహృతి అను పేరు ప్రసిద్ధి కాగలదు" అని ఉంది. 

శ్రీసరస్వతీ ద్వాదశనామ స్తోత్రంలో " సర్వసిద్ధి కరీతస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ " అని ప్రార్ధిస్తాం. ఎల్లప్పుడూ నా నాలుకమీద ఉండు తల్లీ. అప్పుడు ఏది మాట్లాడినా స్పష్టంగా, అర్ధవంతంగా ఉంటుంది.

ఉచ్ఛారణ స్పష్టంగా ఉండాలి అని అంటే గట్టిగా అరవడం కాదు. వేదమాత నిజమైన సంపదలను ఆరుగా తెలియచేసారు. అందులో ఐదవది " స్వాత్మానం వాచః " - వాక్కు/మాటలు మృదువుగా ఉండడం నిజమైన సంపద అని.

వేదాలు వేల సంవత్సరాలుగా మనుగడలో ఉన్నాయంటే కారణం ఈ ఉచ్ఛారణయే. ఒకరినుంచి మరొకరికి చక్కటి ఉచ్ఛారణతో అందించబడ్డాయి వేదాలు. అదే తాళపత్రాలలోనే ఉండి ఉంటే ఎప్పుడో కనుమరుగు అయి ఉండేవి లేక కనుమరుగు చేసి ఉండేవారు. ఏదయినా ఓ అక్షరం పాడయినా, తేడా వచ్చినా అర్ధాలు మారిపోవడానికి కూడా అవకాశం ఉంది.

కహోడమహర్షి, సుజాతల పుత్రుడు అష్టావక్రుడు. ఈయన తల్లి గర్భంలో ఉండగా ఓరోజు తండ్రి శిష్యులకు వేదం చెబుతున్నారు. గర్భంలో ఉన్న కుమారుడు " నాన్నగారు ఈరోజు మీ పారాయణ దోషభూయిష్టంగా ( ఉచ్ఛారణ సరిగాలేదు అని ) ఉంది, 8 తప్పులు దొర్లాయి " అనడంతో మహర్షికి కోపం వచ్చి " నువ్వు నన్నే తప్పుపడతావా, 8 వంకర్లతో పుడతావు " అని శపించాడు. అష్టావక్రుడు మహా పండితుడు. అష్టావక్రగీతను ప్రసాదించాడు.

కొందరు గాయనీ గాయకులు పాడిన కీర్తనలు, భజనలు ఉచ్ఛారణ బాగుండి ఎంతో వినసొంపుగా ఉంటాయి. కొందరు పాడిన వాటిలో ఉచ్ఛారణ దోషాలు స్పష్టంగా తెలిసిపోతాయి కూడా.

ఉచ్ఛారణ సరిగా ఉంటే అమ్మవారిని ధ్యానం చేసుకున్నట్లే.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. శ్రీ గురుభ్యో నమః
    ఒక సందేహం. ఉచ్ఛారణ సరిగా లేని వారు ఏ విధంగా సరిచేసుకోవాలి?

    ReplyDelete
  2. ఉచ్ఛారణ సరిగా లేకపోయినా, మాట్లాడలేకపోయినా ప్రత్యామ్నాయం చూసుకోవాలి. వ్రాసి ఇవ్వచ్చు. వ్రాయడం రాకపోతే సన్నిహితులతో మాట్లాడించవచ్చు. భావం ఏమిటంటే మనం మాట్లాడేది ఎదుటివారికి స్పష్టంగా ఉండాలి. శుభమస్తు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ