సౌభాగ్యాన్ని అంటే అనుభవించే అదృష్టాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భక్తసౌభాగ్యదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 117 వ నామం.
" భక్తసౌభాగ్యదాయినీ " అంటే భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది అని.
ఆయుష్షు, ఆరోగ్యం, సంపదలు, భోగాలు ఉన్నా భాగ్యం చాలా ముఖ్యం. మిగతావన్నీ ఉన్నా ఈ భాగ్యం ( అనుభవించే అదృష్టం ) లేకపోతే సుఖం ఉండదు. ఈ భాగ్యాన్ని అమ్మవారే అనుగ్రహించాలి.
దేవతల కోరిక మేరకు లోక కళ్యాణం, కుమారస్వామి జననం, కోసం మన్మథుడు శివుని మనసులో పార్వతి పట్ల మోహాన్ని కలిగేలా చేయడం కోసం బాణం వేసాడు. శివుడు కోపగించుకుని తన మూడో కంటిని తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. మరి రతీదేవి చేసిన పాపమేమిటి. అమ్మవారి పాదాలపై పడింది భర్తను బ్రతికించమని. అమ్మవారు రతీదేవికి సౌభాగ్యాన్ని ప్రసాదించారు మన్మధుడిని బ్రతికించి.
ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేసారు. ఫలశృతిలో ఇలా తెలియచేసారు:
" యః శ్లోక పంచకం మిదం
లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం
పఠతి ప్రభాతే తస్మై
దదాతి లలితా ఝటితి
ప్రసన్నా విద్యం శ్రియం
విమల సౌఖ్యమనంత కీర్తిం "
" లలితాదేవి యొక్క ఈ శ్లోకముల పంచకమును ఎవరైతే ప్రభాతసమయమున అనగా ఉదయము నిద్రలేచు సమయమున పఠిస్తారో వారికి సౌభాగ్యము ప్రాప్తించును.
వారి యందు లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై విద్యను , సిరిని, విమల సుఖమును, అనంత కీర్తిని ప్రసాదించును " అని. సౌభాగ్యాలన్నిటినీ ప్రసాదిస్తారు అమ్మవారు.
కంచర్ల గోపన్న గారు తన దాశరథీ శతకంలో ఇలా ప్రార్ధించారు రాముడిని:
" చరణము సోకినట్టి
శిలజవ్వని రూపగు టొక్కవింత,
సుస్ధిరముగ నీటిపై గిరులు
దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు
సద్గతి జెందిన దెంతవింత?
యీధరను ధరాత్మజారమణ
దాశరథీ కరుణాపయోనిధీ "
" నీ పాద స్పర్శ మాత్రమున శిల స్త్రీ రూపు దాల్చి అహల్య అయినది. శిలా పర్వతములు సముద్రముపై తేలినవి. ఇట్టి వింతలు జరుగగా నీ స్మరణ చేయు భక్తులు మోక్షము పొందుట వింత ఏమియుగాదు కదా " అని.
మోక్షన్నే ప్రసాదించగల అమ్మవారు సౌభాగ్యములను అనుగ్రహించడంలో ఆశ్చర్యం ఏముంది.
ఈరోజు " సౌభాగ్యగౌరీ వ్రతం ". అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment