అమ్మవారు గంభీరంగా ఉటారంటే అంత స్వచ్ఛంగా ఉంటారని భావం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" గంభీరా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 854 వ నామం.
" గంభీరా " అంటే అంతుపట్టనిది, లోతైనది అని అర్ధం. సముద్రాన్ని గంభీరంగా ఉంది అంటాం, లోతుగా ఉండడంవల్ల అలా అనిపిస్తుంది. ఎంత లోతుకువెడితే అంత స్వచ్ఛత, విలువైనవి దొరుకుతాయి. సముద్రం ఒడ్డున గుల్లలు చిల్లపెంకులు దొరుకుతాయి. అదే లోపలికి వెళ్ళేకొలది ముత్యాలు, శంఖాలు మొదలైన విలువైనవి దొరుకుతాయి. అలాగే బావి త్రవ్వినప్పుడు లోతుకు వెళ్ళేకొలదీ స్వచ్ఛమైన నీరు పడుతుంది.
" హృదయం చాలా లోతు, ఓ పట్టాన బయటపడరు " అంటూంటాం. హృదయకమలంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది. హృదయపులోతుల్లోకి వెళ్ళేకొలదీ తనెవరో తెలుసుకోవచ్చు, అమ్మ అనుగ్రహం పొందవచ్చు. అది అంత సులభం కాకపోయినా ప్రయత్నం చేస్తూ ఉండాలి.
అలలు లేని సముద్రం చూస్తే ఎంతో గంభీరంగా ఉంటుంది. " ఆయన ఎంత గంభీరంగా ఉంటారో, పలకరించడానికే భయంగా ఉంటుంది " అనే మాటలు తరచు వింటూంటాం. మనుషుల్లోనే అలాంటివారు ఉంటే " అమ్మవారు " ఎంత గంభీరంగా ఉంటారో ఊహకు ఎలా అందుతుంది.
అమ్మవారి గంభీరానికి కారణం కూడా ఉంది. ఇన్ని చక్కటి అవకాశాలు ఇచ్చినా ఈ మనుషులు ఇలా అశాశ్వతమైన విషయాల వెంబడి కొట్టుకు పోతున్నారేమిటి?. ఎలా వీరిని తరింపచేయడం అని ఆలోచిస్తూ ఉండడం వల్ల కొంచెం గంభీరంగా ఉంటారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment