మన సంప్రదాయాలన్నీ అమ్మవారు ఇచ్చినవి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సంప్రదాయేశ్వరీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 710వ నామం.
' సంప్రదాయేశ్వరీ " - నామం ఎంత అద్భుతంగా ఉంది.
ఈ పదాన్ని చదువుకున్నవారు చదువుకోనివారు కూడా ఇంచుమించు ప్రతీరోజూ ఏదో సందర్భంలో వింటూనే ఉంటారు, పలుకుతూనే ఉంటారు.
" దాయం " అంటే ఇవ్వబడినది. " ప్ర " అంటే బాగుగా, " సం " అంటే చక్కగా అని అర్ధం. సంప్రదాయం అంటే " చక్కగా బాగుగా ఇవ్వబడినది " అని అర్ధం.
మరి ఇచ్చినది ఎవరు - అమ్మవారు. అందుకే ఆవిడ " సంప్రదాయేశ్వరి " అంటే సంప్రదాయాలకు ఈశ్వరి, నాధ, దిక్కు.
ఒక పని చేస్తే ఉపయోగమేనా మంచిదేనా అనే విషయాన్ని ఆచరించి , పరీక్షించి, మంచి చేస్తుందని అనిపిస్తే ఇలా చెయ్యండి అని చెబుతారు గురువులు. అదే ఒక సంప్రదాయంగా నిలిచిపోతుంది, ఇక పరీక్షించవలసిన అవసరం ఉండదు.
విద్యుత్తు ఎక్కడో తయారయి " తీగల " ద్వారా మన ఇంటికిచేరినట్లు ఈ " సంప్రదాయాలు " అమ్మవారి ( గురుమండలరూపిణి ) నుండి " గురువుల " ద్వారా మనకు చేరతాయి. గురువు నుంచి గురువుకు చేరడాన్నే " గురుపరంపర " అంటారు.
ఉ దా: ఎవరైనా బయట ఊరినుంచి వస్తే " చేతులు కాళ్ళు " కడుక్కోండని చెంబుతో నీళ్ళు ఇస్తాం. కొన్ని ఇళ్ళలో అయితే బయట ఓ సిమెంట్ గోలెంలో నీళ్ళు, ఒక చెంబు ఉంటాయి. ఇంట్లోవారు బయటకు వెళ్ళి వచ్చినా కాళ్ళు చేతులు కడుగుకోవడానికి. ఇది వందల ఏళ్ళుగా వస్తూన్న మన సంప్రదాయం. దీని ఉపయోగమేమిటో " కరోనా " సమయంలో అందరికీ బాగా అర్ధమయింది. అలాగే చేతులు జోడించి నమస్కారం చెయ్యడం, ఇంట్లో నలుగురు బంధువులతో కలిసి చేసుకునే శుభకార్యాలలో గుమ్మాలకి మామిడాకులు కట్టుకోవడం, కాళ్ళకు పసుపు వ్రాసుకోవడం మొదలైనవి ఆరోగ్యరీత్యా సంప్రదాయాలు అయాయి. అంతేకాని కొంతమంది అవివేకులు/అజ్ఞానులు అనుకుంటూన్నట్లు మూఢనమ్మకాలు, పనికిమాలిన పనులు కావు.
సంప్రదాయాలు పాటించేవారికి అమ్మవారు ప్రభువు/నాధ. మరి వాటిని పాటించనివారికి " నాధ " ఉంటుందా?. ఉండదు అందుకే వారు " అనాధలు " అవుతారు.
సంప్రదాయాలను పాటించడం వల్ల లాభమే కాని నష్టం ఏమీ లేదని ఇప్పుడు బాగా తెలుస్తూంది ప్రజలకి. " మడి " అంటే వేళాకోళం చేసేవారు కూడా నేడు ఉతికి ఆరేసిన బట్టలు కట్టుకుని 5 అడుగుల దూరంలో నుంచుని మరీ పలకరించు కుంటున్నారు.
ఎంతో ముందుచూపుతో మన గురువులు మనకు " చక్కగా బాగుగా " అందించిన సంప్రదాయాలను పాటిస్తూ మనల్ని మన సమాజాన్ని కాపాడుకుందాం. ప్రపంచశాంతికి సౌఖ్యానికి మన సనాతనధర్మమే దిక్కు అని చాటుదాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment