ఉగాది, పరాభవ నామ నూతన తెలుగుసంవత్సర శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

ఉగాది పవిత్రమయిన, శాస్త్రీయమయిన భారతీయుల ముఖ్యపండుగ. తెలుగు వారికి తెలుగుతనం ఉట్టిపడే పండుగ. ఈ పండుగను యుగాది అని కూడా పిలుస్తారు. 

ఉగ+ఆది=ఉగాది. ఉగ అంటే నక్షత్రగమనం అని భాష్యం చెప్పారు. మన జీవితమంతా నక్షత్రగమనం మీదే ఆధారపడి ఉందని తెలియచేస్తూంది మన సనాతనధర్మం. విష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాలను అపహరించిన సోమకుడిని చంపి తిరిగి బ్రహ్మకు వేదాలను అప్పగించిన రోజు ఇది. మళ్ళీ తిరిగి సృష్టి ప్రారంభమయిన రోజు. అందుకే యుగాది అని కూడా పిలుస్తారు.

ఉగాదిని మనం వేల సంవత్సరాలుగా చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఎందుకు జరుపుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం:

యజుర్వేదం ఇలా తెలియచేస్తూంది:

" యజ్ఞపతిం ఋషయేవ   

  సాహుః, ప్రజానిర్భక్తా  

  అనుతప్త్యమానా, 

  మధభ్యౌస్తోతా2వపతౌ నరాధ " 

దీని అర్ధం " అర్హత కలిగి శాస్త్రాలు తెలిసిన సోమయాజులు మధుమాసాలలో యజ్ఞాలు చెయ్యకపోతే కరువుకాటకాలు వస్తాయి " అని. ఎంత అద్భుత విషయం తెలియచేసారు మన ఋషులు. ప్రకృతి అంటే అంత గౌరవం, అభిమానం మన పూర్వీకులకు.

యజ్ఞం చెయ్యడం ప్రకృతిలోని లోపాలను సరిచేయడానికి. కాలక్షేపానికి కాదు. యజ్ఞం చేయించే సోమయాజులు " నాకు కుదరదు, ఖాళీలేదు, రాలేను " అని చెప్పకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి.

మరి ఈ " మధుమాసాలు " అంటే ఏమిటి.

వేదంలో ఒక మంత్రం ఇలా తెలియచేస్తూంది:

" చిత్రా పౌర్ణమాసే దీక్షేరముఖంవా,

  ఏతత్ సంవత్సరస్యాయ   

  చిత్రా, పౌర్ణమాసౌ ముఖస ఏవ,

  సంవత్సరమారభ్య దీక్షంతే "

అంటే " సంవత్సరానికి ముఖం ( ముఖద్వారం ) అయిన చైత్రపౌర్ణమి నాడు దీక్ష ప్రారంభించాలి " అని.

అంటే సంవత్సరానికి చైత్రం మొదటి మాసం అని తెలుస్తూంది వేదముఖంగా.

అందుకే చైత్రపాడ్యమిని సంవత్సరం మొదటిరోజుగా " ఉగాది " గా జరుపుకుంటున్నాం మనం వేల సంవత్సరాలుగా.

అంత సంశయరహితంగా తెలియచేస్తుంది మన " సనాతనధర్మము " దేనినయినా, దానికి సాటి లేదు, రాబోదు.

మన సంస్కృతి ఎంత ఉన్నతమయినదంటే క్రొత్త సంవత్సరం అంతా సుఖంగా, ఆనందంగా ఉండాలంటే సంవత్సరారంభం ఎప్పుడూ శుభప్రదంగా ఉండాలనే అభిప్రాయంతో ఉగాది మొదలు తొమ్మిది రోజులు అమ్మవారు శ్రీలలితాదేవీ నవరాత్రులుగా జరుపుకుని, కృతజ్ఞత తెలియచేసుకుని, అమ్మవారి అనుగ్రహం పొందుతాం.

అందరికీ ఉగాది, శ్రీ పరాభవ నామ నూతన తెలుగుసంవత్సర శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ