అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ.

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అంతర్జాతీయ మహిళా దినోత్సవం " నేడు.

శ్రీకృష్ణుడు భాగవతంలో స్త్రీల గురించి గోపబాలకులకు చెబుతూ " స్త్రీ అంటే అర్పణ/ఆశ్రయ/అహంకారరాహిత్య భావం, శుద్దమయిన ప్రేమ " అన్నారు. అందుకే గోపకాంతలంటే అంత ప్రేమ కృష్ణుడికి. 

చాణుక్యుడు " స్త్రీలకు ప్రేమ, ధైర్యం, సహనం, సమస్యలను పరిష్కరించే జ్ఞానం ఎక్కువ " అన్నారు.

స్త్రీలను గౌరవించడంలో అదీ మన సనాతనధర్మం విశిష్టత.

ఒకాయన సంతకి వెళ్ళి ఓ మేకపిల్లని కొన్నాడు. నలుగురు దొంగలు అది గమనించి ఎలాగైనా ఆ మేకపిల్లని కొట్టేయాలని అనుకుని ఒక మంచి ఉపాయం ఆలోచించారు. ఆయన మేకపిల్లని తీసుకుని తన ఊరికి నడిచి వెడుతున్నాడు. అరమైలు దూరం వెళ్ళగానే ఒక దొంగ ఎదురుగా వచ్చి " కుక్కపిల్ల బాగుంది, ఎంతకు కొన్నారు " అన్నాడు. ఈయన ఇది మేకపిల్ల అని చెప్పి ఎదరకు వెళ్ళిపోయాడు. అరమైలు వెళ్ళగానే ఇంకో దొంగ ఎదురువచ్చి " కుక్కపిల్ల ఎంతముద్దుగా ఉందో, ఎంతకి కొన్నారు " అన్నాడు. ఈయన " ఇది మేకపిల్లండి బాబూ కుక్కపిల్లకాదు " అన్నాడు. మిగతా ఇద్దరు దొంగలూ కూడా అలాగే అనడంతో ఈయనకి అనుమానం వచ్చింది, ఇది నిజంగానే కుక్కపిల్లేమో, అందరూ ఎందుకు అలా అంటారు అని అనుకుని దాన్ని రహదారి ప్రక్కన వదిలేసి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. దొంగలు ఆ మేకపిల్లని తీసుకుని చెక్కేసారు.

ఇది అంతా ఇప్పుడు ఎందుకంటే మన వేదాలని ( 20500 మంత్రాలు ), ఉపనిషత్తులని, పురాణాలని, శాస్త్రాలని, రామాయణం ( 24000 శ్లోకాలు ), మహాభారతం ( 100700 శ్లోకాలు ), శృతులు, స్మృతులు ముఖ్యంగా మనుస్మృతిని రకరకాల కట్టుకధలు చెప్పి చెప్పి భ్రష్టుపట్టించేసారు అవివేకులు/అజ్ఞానులు అందరూ కలిసి. 

వేదవిజ్ఞానం ఎంత ఉత్కృష్టమయినది. ఎన్నిరకాల శాఖలు ఎన్ని ఋక్కులు ఎన్ని సూక్తాలు. ఒక వేదంలోని ఒకశాఖని పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. అ ఆ లు రానివాడు కూడా వేదాలు గురించి మాట్లాడడమే.

మనుస్మృతి లో " నస్త్రీ స్వాతంత్ర్యమర్హసి ( 9:3 ) " అని ఉందిట. స్త్రీకి స్వాతంత్ర్యం అక్కరలేదంటాడా, అలా ఎలా అంటాడు అని ఓ చర్చ. ఆయనే " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ( 3:56 ) " అన్నారు కదా. దాని గురించి ఏమీ మాట్లాడరు. దేవతలందరికీ అధిపతి అమ్మవారు. మొదటగా " మాతృదేవోభవ " అనమన్నారు, అమ్మ తరువాతే ఎవరయినా. యమద్వితీయ నాడు మగవారు అందరూ వారి సొదరీమణుల ఇంటికి వెళ్ళి భోజనం ( భగినీ హస్త భోజనం ) చేస్తే ఆయుష్షు పెరుగుతుందని తెలియచేస్తున్నాయి పురాణాలు. శ్రావణపౌర్ణమి నాడు రాఖీ కట్టమన్నాయి సోదరీమణులకు. ఆదిశంకరులు దేవీ అపరాధక్షమా స్తోత్రంలో " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి " - చెడ్డ కొడుకు ఉంటాడేమోకాని చెడ్డతల్లి ఎప్పుడూ ఉండదు " అన్నారు. స్వతంత్ర్యం ఉండకూడదంటే కట్టిపడేయడం కాదు, ఒంటరిగా వదిలేయకు, ఎప్పుడూ తోడుండు, సహాయంగా నిలబడు అని.

ఆశ్చర్యం ఏమిటంటే ఇలా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళందరూ కూడా తమ కుమార్తెగాని, భార్యగాని రాత్రి/తెల్లవారకట్ట విమానాశ్రయానికి వెళ్ళవలసి వస్తే మాత్రం కూడా తనో కుమారుడో వారి కూడా ఉండేలా చూసుకుంటారు కాని ఒంటరిగా పంపించే ధైర్యం చెయ్యరు. ఇవన్నీ ఊహించే వేలసంవత్సరాల క్రితమే అటువంటి కట్టుబాట్లు చేసింది మన సనాతనధర్మం. అవి ఇప్పటికి ఎప్పటికీ నిత్యనూతనమే

ఒక అన్యమతస్తుడు ( మొన్నటికి మొన్న ) " మనుస్మృతి " ని పొగుడుతూ " అద్భుతం " అని అనడం చదివినప్పుడు ఆనందమూ బాధా కలిగాయి. ఎంత భ్రష్టుపట్టించేసారు మన సనాతనధర్మాన్ని అని బాధ కలుగుతుంది.

నేడు " అంతర్జాతీయ మహిళామణుల దినోత్సవం ". మనల్ని అన్నివిధాలా చల్లగా చూస్తూన్న అమ్మవారికి, మనకు జన్మనిచ్చి తీర్చిదిద్దిన తల్లికి, మన సోదరీమణులకు, మనకు కష్టసుఖాల్లో తోడూనీడగా నిలిచిన మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుని ధన్యులమవుదాం. 

సర్వే జనాః సుఖినో భవంతు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ