యముడు సమవర్తి , పుణ్యాత్ములకు కరుణామూర్తి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" యమః " విష్ణుసహస్రనామాలలో ఒక అద్భుత నామం. యమః అంటే లోపలనుండి నడిపించువారు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
కాని " లోపల ఉండి నడిపించువారు " అనుకోవచ్చు. శరీరంలోని వెన్నెముక దగ్గరలో ఉండి జీవుడి కర్మఫలాలను నమోదు చేస్తూ ఉంటారు యముడు. ఇది ఆయన సూక్ష్మ శరీరం.
యముడు సమవర్తి. శాంత స్వరూపుడు. మంచిపనులు చేసేవారికి అలాగే కనబడుతారు. మరణానికి ముందు యముడు కనబడుతారు. ఆయన పాపులకు భయంకరంగా కనిపిస్తారు. ఎర్రటి కళ్ళు, కోరలు, పొడుగు ముక్కు, పాశం పట్టుకుని. భయపడిపోతాడు పాపి.
కఠోపనిషత్తు " యమ - నచికేతుల " సంవాదం. ఆత్మస్వరూపం గురించిన అద్భుత వివరణ ఈ ఉపనిషత్తు.
మన కర్మలను గమనించే వారిలో యముడు ఒకరు.
గరుడపురాణం " ఆదిత్య చంద్రౌ అనిలో అనలశ్చ యౌ భూమి ఆపః హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాధి నరశ్చ వృత్తిం " అని తెలియచేస్తూంది. వీరందరూ సాక్షులు, జీవుల కర్మలను గమనిస్తూ ఉంటారు.
ఈ సాక్షులు - ఉన్నది ఉన్నట్లు చెబుతారు. తెలిసి చేసేవి, తెలియకుండా చేసేవి అన్నీ గమనిస్తారు. వీరిని మంచి చేసుకుని జాగ్రత్త పడవచ్చు. ఎలాగంటే " వ్రతైశ్చ దానశ్చ సత్యంవ్య..." - వ్రతాలు, దానాలు ద్వారా. ఇవి తరచూ చేస్తూ ఉంటే వీరందరూ సంతోషిస్తారు. సాక్ష్యం మంచిగా చెబుతారు.
ఈ సాక్షులలో హృదయం కూడా ఉంది. అంతరాత్మ. మన కర్మల విషయం మనకు ఎరుకే. కాని మాయ కమ్మేస్తుంది.
యముడు కనబడగానే జీవుడు భయపడిపోతాడు. తను చేసిన పాప కర్మలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. తనను జాలిగా చూస్తూన్న బంధువులు, స్నేహితులతో ఏదో చెప్పాలని ఉబలాటపడతాడు. కాని గొంతుక పూడుకుపోయి మాట రాదు. ప్రాణం విడుస్తాడు కన్నీళ్ళు కారుస్తూ.
మనం మన సంప్రదాయచదువులకు దూరమయి పోయాం. అలా దూరమయేలా చేసారు గత పాలకులు. మరణం తరువాత పరిస్థితి ఏమిటి అనే ఆలోచన లేదు ఎవరికీ. భయం పోయింది. ధర్మానికి దూరమయిపోయాం.
కఠోపనిషత్తు ఇలా తెలియచేస్తూ ఉంది:
" ఉత్తిష్ఠత! జాగ్రత!
ప్రాప్య వరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా
దురత్యయా దుర్గం
పథస్తత్కవయో వదంతి "
" లే, జాగ్రత్తపడు, గమ్యం చేరేవరకూ ఆగకు " అని. ఇదే వివేకానందుడి నినాదం అయింది.
వాక్సిన్ సరైనదో కాదో తెలియదు, పనిచేస్తుందో లేదో తెలియదు. కాని నమ్మకంతో అందరం వేసుకున్నాం. మరి ఋషులు తమ దివ్యశక్తులతో దర్శించి, ఆచరించి, తెలియచేసిన విషయాలు పాటించడానికి సంశయం దేనికి. ఋషులు చెప్పిన విషయాలేమీ కష్టమయినవీ, పాటించలేనివీ కాదు కదా.
మన సంప్రదాయాలను పాటిస్తూ ఇహపరలోకాలలో మన జీవితాలను సుఖమయం చేసుకుందాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీమన్నారాయణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment