అహంకారం మమకారం వదలకపోతే పతనమే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" కామమాశ్రిత్య దుష్పూరం
దంభమానమదాన్వితాః,
మోహాద్గృహీత్వా2సద్గ్రాహాన్
ప్రవర్తంతే2శుచివ్రతాః "
- భ.గీత 16:10
" దంభము, దురభిమానము, మదములతో గూడిన ఈ అసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, తమవాంచలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిధ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు " అన్నారు పరమాత్మ.
దంభము అంటే అహంకారం. దురభిమానం అంటే మమకారం. ఈ రెండూ మనిషి పతనానికి హేతువులు.
పాండవుల అజ్ఞాతవాసం కూడా అయిపోయాక ధృతరాష్ట్రుడికి భయం పట్టుకుంది యుద్ధం తప్పదేమోనని.
సంజయుడుని దృతరాష్ట్రుడు పాండవులవద్దకు రాయబారం పంపిస్తాడు. " నువ్వంటే పాండవులకు గౌరవం , అభిమానం. కనుక తీయటిమాటలు చెప్పి పాండవుల బుర్రలోంచి యుద్ధం అనే ఆలోచన తీసేసి రా " అని.
సంజయుడు వెళ్ళివచ్చి కురుసభలో అందరి సమక్షంలో ఏమి జరిగిందో ఇలా చెబుతాడు:
ధర్మరాజు సంధే కోరుతున్నాడు. అర్జునుడు ఏదో అనబోతూంటే చిరునవ్వుతో వారించి కృష్ణుడు ఇలా అన్నారు నాతో " సంజయా, మీ ప్రభువు నిండుకొలువులో ఉండగా సభ్యులందరూ వినేటట్లుగా చెప్పవలసిన మాటలు విను. శాంతమూర్తి అయిన ధర్మజుడు ఆగ్రహిస్తే అంతా తగలబడడమే. ప్రమాదం ముంచుకువస్తూంది కనుక వారికి కొన్ని విషయాలు చెప్పు:
" యోగ్యులయిన వారిని పిలిపించి చెయ్యవలసిన దానధర్మాలు చేసుకోమను. ఆశ్రితులకు ఇవ్వవదలచుకున్నవి ఇచ్చేసుకోమను. అనుభవించవలసిన భోగాలేమయినా ఉంటే త్వరగా అనుభవించమను. భార్యాబిడ్డలకు చెయ్యవలసిన సదుపాయాలన్నీ త్వరగా చేసుకోమను. ఇంకా ఏమేమి చెయ్యాలో చేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండమను.
పదమూడు సం.ల క్రితం మీ సభాభవనంలో అవమానాలు పడలేక దిక్కులేనిదానిలా విలపిస్తూ నన్ను స్మరించింది ద్రౌపది. నాటినుంచీ ఆమె కోరిక తీర్చనందుకు బాధపడుతున్నాను. ఇప్పుడా ఇల్లాలిని పరాభవించిన వారందరికీ తగిన శాస్తి చేసే సమయం వచ్చేసింది అని చెప్పు అన్నారు శ్రీకృష్ణుడు " అని.
ఇది విన్న భీష్మద్రోణాదులు ధృతరాష్ట్రుడిలో మార్పు వస్తుందనుకుంటారు. కాని ధృతరాష్ట్రుడు అంటాడు " అసలు ఏమి చూసుకుని పాండవులకు అంత ధైర్యం. మా సైనికబలం ముందు వారి బలమెంత " అని.
దంభము, దురభిమానం అంతటి భయంకరం. మాయ కమ్మేస్తుంది. వంశనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు ధృతరాష్ట్రుడు.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment