అన్నమయ్య వర్ధంతి నేడు, కారణజన్ములు, నివాళులు అర్పించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏

అన్నమయ్య కీర్తన:

నాటరాగం - తాళం ఖండవతి

ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు 

ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు

చరణం :

ఎందరికి కొడుకుగాడీ జీవుడు 

ఎందరికి తోబుట్టడీ జీవుడు

ఎందరికి కొడుకుగాడీ జీవుడు వెనక ఎందరికి తోబుట్టడీ జీవుడు ఎందరిని భ్రమియింపడీ జీవుడు

దుఃఖ మెందరికి గావింపడీ జీవుడు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు…..

ఎక్కడెక్కడ తిరుగడీ జీవుడు 

ఎక్కడో తన జన్మ మీ జీవుడు

ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు వెనుకఎక్కడో తన జన్మ మీ జీవుడుఎక్కడీ చుట్టము ఈ జీవుడు ఎప్పుడెక్కడికి నేగునో ఈ జీవుడు

ఎవ్వరెవ్వరి వాడో ఈ 

జీవుడు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు…..

ఎన్నడును చేటులే నీ జీవుడు ఎన్ని తనవులు మోవడీ జీవుడు ఎన్నడును చేటులే నీ జీవుడువెనుక ఎన్ని తనవులు మోవడీ జీవుడుఎన్నగల తిరువేంకటేశు మాయలదగిలియెన్ని పదవుల బొందడీజీవుడు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు 

ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు  

ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు "

కీర్తన అచ్చతెలుగులో ఉంది కనుక అర్ధం మళ్ళీ అక్కరలేదు. ఎంతటి ఉపనిషత్తుల సారాంశం, వేదాంతం నిండి ఉందో ఈ కీర్తనలో. భాగవతంలో జీవుడి గురించిన ఓ అద్భుత కధ ఉంది. 

వృత్రాసురసంహారం - ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించడానికి వజ్రాయుధం సంపాదించడం, ఆ వజ్రాయుధంతో వృత్రాసురుడిని సంహరించడం అందరికీ తెలిసినదే. 

వృత్రాసురుడు తన గత రెండవ జన్మలో చిత్రకేతువు అనే మహారాజు. ఈయనకు ఎందరో రాణులు కాని పిల్లలు లేరు. అంగీరమహర్షిని ఆశ్రయించాడు ఏదయినా మార్గం తెలియచేయమని. ఆయన ఓ యాగం చేయించడం, ఓ చక్కటి పిల్లాడు పుట్టడం జరిగింది. లేక లేక వారసుడు పుట్టడంతో రాజు మహదానందపడి పోయాడు. పిల్లాడి తోడిదే లోకం అయిపోయింది రాజుకు. మిగతా రాణులు, బంధువులు అసూయతో రగిలిపోయారు. ఎలాగయినా పిల్లాడిని చంపేసి రాజుకు వారసుడు లేకుండా చేయాలని కుట్ర చేసి అందరూ కలిసి రహస్యంగా పిల్లాడిని చంపేసారు. రాజు తట్టుకోలేక పోతాడు. ఒక్కగానొక్క కొడుకు, లేకలేక కలిగాడు. పిల్లవాడి శవం ముందు కూర్చుని విలపిస్తూనే ఉన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. పాలన కుంటుపడిపోయింది. ప్రజలు నానా బాధలూ పడుతున్నారు.

విషయం తెలిసి అంగీరమహర్షి నారదులవారితో వచ్చి చిత్రకేతువుని ఓదారుస్తాడు. అలా దుఃఖిస్తూ కూర్చుని నీ బాధ్యతలను విస్మరించడం సరికాదు అని చెబుతారు. కాని ప్రయోజనం కలగలేదు. రాజు దుఃఖంలోంచి బయటపడలేక పోతాడు. అప్పుడు నారదుడు రాజుతో " ఇతను నీ కొడుకు, లేకలేక కలిగాడు, దుర్మరణం చెందాడు అని బాధపడుతున్నావు కదా ఈ జీవుడిని మళ్ళీ ఈ పసివాడి మృతశరీరంలోకి ప్రవేశ పెట్టమంటావా " అని అడుగుతాడు. జీవుడు కొన్ని రోజులు ఆ పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుందని తెలిసిన విషయమే. అందుకే జీవుడికి కర్మకాండలు చేసేది. 

నారదుడు అలా అనేసరికి ఆనందంతో సరే అంటాడు రాజు. నారదుడు జీవుడితో " ఇక్కడ ఉన్న వీరందరూ నీ తండ్రి, తల్లి, బంధువులు. నువ్వు మళ్ళీ ఈ/నీ మృతశరీరంలోకి ప్రవేశించు " అంటాడు. అప్పుడు జీవుడు " ఏ జన్మలో వీరు నాకు తల్లి, తండ్రి, బంధువులు " అని అడిగేటప్పటికి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోతారు. 

అంటే ఆ జీవుడికి ఎన్నో జన్మలు అయిపోయాయి. ఒక్కొక్క జన్మలో వేరు వేరు తల్లిదండ్రులు , తోబుట్టువులు, బంధువులు. జీవుడు శరీరం వదలగానే ఆ బంధాలన్నీ తెగిపోతూంటాయి. జీవుడు - శరీరం బంధమే అశాశ్వతం అయినప్పుడు మిగతావారితో అతని సంబంధాలు శాశ్వతం ఎలా అవుతాయి.

రాజు చిత్రకేతువుకి " ఇదా జీవితం, ఇదా శరీరానికి జీవుడికి ఉండే సంబంధం. దీని కోసమా ఇంతటి అనుబంధం, అనురాగం, సంతోషం, దుఃఖం " అనిపించి వైరాగ్యం కలుగుతుంది. ఈ జీవితమే అసత్యం అని భావించి సత్యం తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించమని నారదులవారి పాదాలు పట్టుకున్నాడు. నారదుడు సంకర్షణుడిని ఆరాధించు అని మంత్రోపదేశం చేస్తారు.

అన్నమయ్య జీవుడికి శరీరానికి ఉండే సంబంధాన్ని ఎంత అద్భుతంగా తెలియచేసారు ఈ కీర్తనలో. ఎందరికో కొడుకుగా, ఎందరికో తోబుట్టువుగా, ఎందరికో చుట్టంగా పుడతాడు. ఎందరినో ఏడిపిస్తాడు, ఎందరినో నవ్విస్తాడు. చివరికి శ్రీవేంకటేశ్వరుడి మాయ కారణంగా ఎన్ని పదవులను అలంకరిస్తాడో జీవుడు అన్నారు. ఎంత అద్భుత సాహిత్యం మరియు వేదాంతం.

ఇటువంటి కీర్తనలు మానసిక ప్రశాంతతనే కాదు జీవితసత్యాలను తెలియచేస్తాయి. 

కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్రసరస్వతి ఓ సారి శంకరజయంతి సందర్భంగా అనుగ్రహభాషణం చేస్తూ " సంస్కృతభాషలోనే కాదు ప్రాంతీయభాషలలో కూడా అద్భుత వాజ్మయం ఉంది. దానిని కూడా ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలి " అని తెలియచేసారు. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. అదీ మన దేశ వాజ్మయ విశిష్టత.

పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తే ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడవేస్తారు.

నేడు అన్నమాచార్య వర్ధంతి, కారణజన్ములు, నివాళులు అర్పించుకుందాం.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ