శ్రీపంచమి/వసంతపంచమి నేడు. శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" పంచకృత్యపరాయణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 274 వ నామం .
" పంచకృత్యపరాయణా " అంటే పంచకృత్యములు అనగా సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహముల యందు ఆసక్తి గలిగినది.
సృష్టి స్థితి లయ అనుగ్రహం అనే నాలుగూ తెలిసినవే. తిరోధానం ఒక అద్భుత ప్రక్రియ. తిరోధానం అంటే మరుపు. ఇది లేకపోతే జీవితం నిస్సారం. చేదు అనుభవాలనే అస్తమానూ తలచుకుంటూ కృంగిపోతారు.
ఇది మర్త్యలోకం. మోక్షభూమి. పాపపుణ్యాల ఫలాలు అనుభవించి మోక్షం పొందడానికి జీవుడు ఇక్కడ జన్మ తీసుకుని తీరాలి. ప్రతీ మనిషి జీవితంలోనూ చేదు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తప్పదు. వాటిని ప్రక్కన పెట్టి ఎదరకు సాగుతూ ఉండాలి.
సీతమ్మ హనుమతో అంటారు " మానవుల జీవితాలు వింతగా ఉంటాయి. వారికి సుఖసంతోషాలు సెలయేరులు కొండలులా చిన్నవిగా అనిపిస్తాయి, దుఃఖం కష్టాలు మాత్రం సముద్రం, ఆకాశంలా పెద్దగా అనిపిస్తాయి " అని.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః
స్మృతిర్ జ్ఞానమపోహనం చ,
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవి దేవ చాహమ్ "
- భ.గీత -15:15
" నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి " అన్నారు పరమాత్మ.
ఎంత ఆనందం కలిగించే విషయమయినా రెండు రోజులే గుర్తుంటుంది. తక్కువ బాధ కలిగించే విషయమయినా చాలాకాలం బాధపెడుతుంది. కాని మరవడం మాత్రం తథ్యం. ఈ మరుపు అమ్మవారి అనుగ్రహం.
అమ్మవారి నామజపం చేసుకుని తరిద్దాం.
ఈరోజు శ్రీలలితాదేవీ నవరాత్రులలో పరమపవిత్రమైన శ్రీపంచమి/వసంతపంచమి. శుభదినం. అమ్మవారి జపం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత శుభం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment