శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అందాల రాముడు

  ఎందువలన దేముడు "

" యజ్ఞానాం జపయజ్ఞో2స్మి " అన్నారు పరమాత్మ భ.గీతలో ( 10:25 ).

ధర్మబద్ధమయిన కోరికలు తీరడంకోసం ఏదయినా మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. కాని ముక్తినిచ్చే తారక మంత్రం ఒకటే. అది " రామ " నామం.

రామనామం ఎందుకు అంత పవిత్రమయినది/ఉత్కృష్టమయినది/శక్తివంతమయినది అయింది?.

రామ లో " ర+అ+మ " - 3 అక్షరాలు ఉన్నాయి. ర అగ్నిబీజం, అ సూర్యబీజం, మ చంద్రబీజం. 

మనసా(మ) వాచా(ర) కర్మణా(అ) అంటారు - రామ నామంలో ఈ మూడూ ఉన్నాయి.

విష్ణుసహస్రంలో " రామః విరామః " అనే నామాలతో ప్రార్ధిస్తాం స్వామిని. ఆదిశంకరులు రామః కి " నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు " అని భాష్యం చెప్పారు.

వేదం ఇలా చెబుతూంది:

" రకారో అగ్నిబీజంశ్చాత్, 

  అకారో సూర్యబీజకం, 

  మకారశ్చంద్రబీజంచ " అని.

కుండలినీయోగాలో కూడా చక్రాలను 3 మండలాలుగా విభజించారు. మూలాధారం నుంచి అనాహతచక్రం వరకూ అగ్నిమండలం అని, అక్కడనుంచి ఆజ్ఞాచక్రం వరకూ సూర్యమండలం అని, ఆపైనదానిని చంద్రమండలం అనీ తెలియచేసారు.

రామ అని జపిస్తే ఈ 3 మండలాలూ జాగృతి/చైతన్యం చెందుతాయి. మనస్సు అలలు లేని సముద్రంలా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. మంచి ఆలోచనలు తప్ప చెడు ఆలోచనలు దరిచేరవు. సుఖమయ జీవితానికి అంతకంటే కావలసినది ఏముంటుంది. అందుకే రామనామం అంత శక్తివంతమయింది.

వాక్కుని శరీరాన్ని మనస్సుని చైతన్యపరిచేది రామ నామం.

" రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః " అంటే " సర్వజనులను ఆనందింపచేసే గుణాలున్నవాడు రాముడు " అని తెలియచేస్తున్నాయి పురాణాలు. 

గరుత్మంతుడు శ్రీరాముడిని " రిపుణామతి వత్సలా " అంటే " శత్రువులమీద కూడా వాత్సల్యం చూపేవాడు " అని కొనియాడాడు.

అమ్మవారు పార్వతీదేవి శివుడుని అడుగుతుంది " నిత్యం విష్ణుసహస్రం పారాయణచేసే పండితులు ఎప్పుడయినా ఏకారణంచేతనయినా చదువలేకపోతే ఆ విష్ణుసహస్రనామ పారాయణ ఫలితాన్ని పొందడానికి ఏమి చెయ్యాలి " అని. రామనామాన్ని 3 సార్లు జపిస్తే విష్ణుసహస్రపారాయణ ఫలితం లభిస్తుందని శివుడు తెలియచేసారు. రామనామం అంత పవిత్రమయినది.

" ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం " - ఆపదలను పోగొడుతాడు, సంపదలన్నీ ఇస్తాడు. ఇంకేమి కావాలి సుఖమయజీవితానికి. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష.

" అందాల రాముడు

  అందువలన దేముడు "

ఈరోజు మన భారతజాతికంతటికి పరమపవిత్రమయిన శ్రీరామనవమి. శుభాకాంక్షలు అందరికీ.

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ