శ్రీరామునికి సీతమ్మ కరమాల - చీమలపాటి సూర్యనారాయణ
🙏""శ్రీరస్తు శుభమస్తు"🙏
శ్రీరాముడు ఖరదూషణాదులను సంహరించే సమయంలో ఒక కమనీయమయిన శృంగారఘట్టం జరిగింది.
సీతమ్మతల్లి అంతవరకూ రాముడి ఒక పార్శ్వాన్నే చూసింది.
శివధనస్సు ఎక్కుపెట్టడం అది విరిగిపోవడం రెప్పపాటుకాలంలో జరిగింది. అదేమీ సీతమ్మకు గుర్తేలేదు.
జనకుడు " మా అమ్మాయిని వివాహం చేసుకో రామా " అంటే " అలాగే మామయ్యగారూ " అనలేదు రాముడు, " నా తల్లిదండ్రులు సమ్మతిస్తే చేసుకుంటాను " అన్నాడు.
యువరాజపట్టాభిషేకం చేస్తానంటే సరే అన్నాడు. వద్దులే అరణ్యవాసానికి వెళ్ళు అంటే సరే అన్నాడు. " రాజూ లేడు రాణీలేదు, నువ్వు ఊ అను వీళ్ళ సంగతి తేల్చేస్తాను " అన్న లక్ష్మణుడిని " ఏమిటా మాటలు " అని మందలించాడు. తనుకూడా అరణ్యానికి వస్తానంటే " సీతా నువ్వు ఆ కష్టాలు భరించలేవు, వద్దు " అన్నాడు. భరతుడు అడుగగానే అరణ్యంలో తిరగడం కష్టమని తెలిసీ పాదుకలను కూడా ఇచ్చేసాడు.
అటువంటి పరమశాంతమూర్తి, దయార్ద్రహృదయుడు ఇంతమంది క్రూరులయిన రాక్షసులతో యుద్ధం చేస్తూన్నప్పుడు " ఎలా ఉంటాడో " చూడాలని ముచ్చటపడింది సీతమ్మ.
బయటకు వచ్చి చాటుగా నుంచుని చూసింది. 3 ఘడియలలో ( 72 ని.లు ) 14000 మంది ఖరదూషణాదులను సంహరించగానే రాముడి ఇంకో పార్శ్వాన్ని చూసిన సీతమ్మకు ఆశ్చర్యంవేసింది.
సంతోషాన్ని నిగ్రహించుకోలేక పరిగెత్తుకుని వెళ్ళి తన రెండుచేతులతోనూ రాముడి కంఠాన్ని పెనవేసుకుంది.
ఈ ఘట్టాన్ని తులసీదాసు " శివధనస్సు ఎక్కుపెట్టినప్పుడు సీతమ్మ వర ( పూల ) మాల వేసింది, ఇప్పుడు ఆనందంతో కరమాల వేసింది " అని వర్ణించారు తన రామాయణంలో.
రాముడు జగదానందకారకుడు, ఘటనాఘటన సమర్ధుడు.
ఈరోజు ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి కళ్యాణం. శుభాకాంక్షలు.
చంద్రుడు " స్వామీ, మీ కళ్యాణాన్ని అందరూ చూసి తరించారు. నాకు కూడా ( చంద్రుడు పగలు ఉండడు ) ఆ భాగ్యాన్ని కలిగించండి " అని శ్రీరాముడిని కోరితే ఒంటిమిట్టలో చైత్రపౌర్ణమి రాత్రి నా కళ్యాణం తిరిగి జరుగుతుంది, చూసి ఆనందించు" అని అనుగ్రహించారు స్వామి.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment