హనుమజ్జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏

శ్రీహనుమ జయంతి నేడు. 

" మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం " - బుద్ధిమంతుల్లోకెల్లా వరిష్టుడు. 

ఈ రోజు స్వామిని స్మరించుకుని తరిద్దాం.

స్వామి వేదశాస్త్రాలు ఎవరిదగ్గర నేర్చుకోవాలా అని ఆలోచించి సూర్యదేవుడిని అడుగుతాడు. ఆయన " నాకెలా కుదురుతుంది, నేను నిత్యసంచారిని కదా " అంటారు. మీ సంచారానికి ఆటంకంలేకుండా నేర్చుకుంటానని చెప్పి సూర్యుడి ముందర గాలిలో తేలుతూ వెనక్కి ప్రయాణిస్తూ విద్య నేర్చుకున్నారు. 

హనుమ మొదటిసారి శ్రీరామలక్ష్మణులని కలిసినప్పుడు 3 ప్రశ్నలు వేస్తారు : 1. మీరు ఎక్కడనుంచి వస్తున్నారు. 2. ఏపనిమీద వస్తున్నారు. 3. మీరు ధరించిన వస్త్రాలకి మీ ఆయుధాలకి పొంతన కుదరడంలేదేమి?. అంటే వీరి మొత్తం వృత్తాంతం 3 ప్రశ్నలతో తెలిసిపోతూంది. రాముడు ఆశ్చర్యపోయి లక్ష్మణుడితో " ఈయనతో మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి సుమా " అని అన్నారు. 

నూరుయోజనాల సముద్రాన్ని లంఘించి లంఖిణిని ఒక్క గుద్దుతో చంపేసిన హనుమ సీతమ్మని కలిసినప్పుడు ఆవిడ అంటుంది " సైన్యంతో నూరుయోజనాల సముద్రాన్ని దాటుకుని వచ్చి ఈ రాక్షసులని చంపి శ్రీరాముడు నన్ను తీసుకెడతాడంటే నమ్మకం కుదరడంలేదు " అని. అంతగా బేలగా మాట్లాడిన నిస్సహాయ స్త్రీకి ధైర్యం చెప్పడం మాటలా. హనుమ అంటారు " మా రాజు సుగ్రీవుడి సైన్యంలోని అతి తక్కువ శక్తిశాలిని అమ్మా నేను, మిగతా అందరూ నాకన్నా శక్తిశాలురే. నేనే రాగలిగానంటే వారు రాలేకపోవడమేమిటమ్మా, నీకు ఆ అనుమానమే అక్కరలేదు " అని. అప్పుడు సీతమ్మ మనస్సు కుదుటపడుతుంది.

ఎక్కడ ఎలా ఎంతవరకూ మాట్లాడాలో హనుమను చూసి నేర్చుకోవాలి.

ఇంద్రజిత్ ఓ రాత్రి యుద్ధంలో వానరసైన్యాన్ని చితక్కొట్టేసి " యుద్ధం అయిపోయింది, అందరూ చనిపోయారు " అని వెళ్ళి చెబుతాడు రావణుడితో. విభీషణుడికి మతిపోతుంది. ఓ దీపాన్ని పట్టుకుని అసలు ఎవరైనా మిగిలి ఉన్నారా అని చూడడానికి బయలుదేరతాడు. ఒకచోట హనుమ కనిపిస్తాడు. అమ్మయ్య అనుకుని ఇద్దరూ కలిసి కొంచెం ముందుకు వెడతారు. జాంబవంతుడు మూలుగుతూ పడుకుని ఉంటాడు. " తాతా కుశలమా " అని విభీషణుడు అడిగితే ఆయన " హనుమ కుశలమా " అని అడుగుతాడు. 

విభీషణుడు ఆశ్చర్యపోయి " అదేమిటి తాతా రామలక్ష్మణుల గురించి అడుగుతావనుకుంటే హనుమ గురించి అడిగావు " అని. ఆయన అంటారు " హనుమ కుశలంగా ఉంటే మనకు అంతా క్షేమమే, నష్టమే లేదు, అతను కుశలంగా లేకపోతే మనకు ఒరిగే ఏ ప్రయోజనమూ లేదు " అని. హనుమ ఒక్కడుంటే చాలని. హనుమ కన్నీళ్ళతో " నేను కుశలమే తాతా " అని జాంబవంతుడి కాళ్ళకు నమస్కారం పెడతాడు. అవీ హనుమ శక్తిసామర్ధ్యాలు.

హనుమ " అవ్యాజకరుణామూర్తి ", ఒక్కసారి శ్రీరామ అంటే చాలు, సదా మనతోనే ఉంటూ సంరక్షిస్తూ ఉంటాడు. కిం సంశయం?

అందరికీ శ్రీహనుమజ్జయంతి శుభాకాంక్షలు - సూర్య.

ఏతత్ సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ