సీతమ్మను " అనింధనాగ్ని " అన్నారు విశ్వనాధవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అందాల రాముడు
ఎందువలన దేముడు "
రామాయణ మహాభారతాలు అత్యద్భుత ఇతిహాసాలు. వాల్మీకి/వ్యాసర్షి ఎన్నో సందేహాలకు సమాధానాలు అక్కడే ఇచ్చేసారు. అవి పూర్తిగా చదవని మందబుద్ధులకు, కుసంస్కారులకు ఇప్పటికీ సందేహాలు వస్తూనే ఉన్నాయి.
రావణవధ అయాక రాముడు సీతాదేవిని తీసుకురమ్మని చెబుతూ " నడిపించి తీసుకుని రండి " అన్నారు. అలా నడిపించి తీసుకురమ్మనడానికి అద్భుతమయిన కారణం ఉంది. అక్కడ రాముడితో బాటు లంకవీరులు, కిష్కింధవీరులే కాకుండా జంబూద్వీపంలోని ఎందరో వానరవీరులున్నారు. సీతమ్మని వెతకడానికని సుగ్రీవుడు జంబూద్వీపంలోని తమ రాజులందరినీ సైన్యాలతో రమ్మని కబురు పంపుతాడు. అందరూ వస్తారు, యుద్ధంలో కూడా పాల్గొన్నారు.
వీరెవ్వరూ సీతమ్మను చూడలేదు అంతవరకూ. వినడమే కాని ఆమెగురించి ఏమీ తెలియదు. ఏడాదిపాటు పరాయిరాజ్యంలో ఉన్న సీతమ్మ గురించి భవిష్యత్తులో కూడా ఎవరూ సందేహాస్పదంగా మాట్లాడకూడదన్నది రాముడి అభిప్రాయం. అందుకే నడిపించి అందరూ చూస్తూండగా తీసుకురమ్మన్నారు, అగ్నిప్రవేశం చేయించారు, అగ్నిదేవుడు భద్రంగా తీసుకొచ్చి సీతమ్మను రాముడికి అప్పగించారు. ఈ ప్రక్రియనంతా అక్కడ ఉన్న అందరూ చూసి తిరిగి వెళ్ళాక వారి ప్రజలకు తెలియచేయాలన్నది రాముడి అభిలాష. అప్పుడే సీతమ్మ పవిత్రత లోకానికంతటికీ తెలుస్తుందని ఆయన భావన. ఈ పని రాముడుగా చేయలేదు, ఓ ఆదర్శ రాజుగా చేసారు. రాజు నడవడికలో దోషం సందేహాస్పదంగా అయినా కనబడకూడదు. తరతరాలు బాధపడవలసి వస్తుంది.
విశ్వనాథ వారు సీతమ్మను " అనింధనాగ్ని " అన్నారు. అగ్నిమంట రావాలంటే ఓ కర్రో చమురో ఉండాలి కదా. సీతమ్మకు ఇంధనం అక్కరలేదు. ఆవిడ సదా జ్వలించే అగ్ని అని తెలుసుకోవాలి.
జగదానందకారకుడు శ్రీరాముడు.
" అందాల రాముడు
అందువలన దేముడు "
ఏతత్ సర్వం శ్రీరామచంద్రపాదార్పణమస్తు - సూర్య.
శుభమస్తు
Comments
Post a Comment