అమ్మవారు గొప్పవారు, రూపంలో పెద్దవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బృహతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 673 వ నామం.
" బృహతీ " అంటే అన్నింటికన్నా గొప్పది అని భాష్యం చెప్పారు. జ్ఞానంలోనూ, కరుణలోనూ, శక్తులలోనూ అమ్మవారు గొప్పవారు అని తెలుస్తూనే ఉంది. బ్రహ్మా, ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారిని సేవించుకుని తరిస్తున్నారు.
రూపంలో కూడా అమ్మవారు పెద్దవారే. కఠోపనిషత్తు " ( అమ్మవారి కన్నా ) చిన్నదీ లేదు, పెద్దదీ లేదు " అని తెలియచేస్తూంది.
కర్ణాటకలో మద్దూరు అనే గ్రామం ఉంది. అక్కడ ఉగ్రనృసింహస్వామి విగ్రహం ఉంది. స్థలపురాణం ఏమి తెలియచేస్తూందంటే అర్జునుడు పరమాత్మని " నీ నృసింహ అవతార రూపాన్ని చూడాలని ఉంది " అని అడుగుతాడు. స్వామి అంటారు " వద్దు. నీ శక్తి సరిపోదు. తట్టుకోలేవు. నువ్వు కోరేవు కనుక ఈ లోహ విగ్రహాన్ని ప్రసాదిస్తున్నాను " అని చెప్పి విగ్రహాన్ని ఇస్తారు. ఆ విగ్రహమే ఆ గ్రామంలో ఉన్నది. ఉగ్రనృసింహస్వామి రూపం అలాంటిది, అర్జునుడినే తట్టుకోలేవు అన్నారు పరమాత్మ.
కోయంబత్తూర్ సమీపంలో " ప్రత్యంగిరాదేవి " ఆలయం ఉంది. దానికి స్థలపురాణం ఉంది.
నృసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపినతరువాత చాలాకాలం ఆ కోపం/ఉగ్రం లోంచి బయటకు రాలేక అడవులు పట్టితిరుగుతున్నారు. బ్రహ్మ, ఇంద్రుడు వంటివారు, ఆఖరికి లక్ష్మీదేవి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో శివుడిని వేడుకున్నారు ఏదో ఒకటి చేసి ఆయన్ని మామూలుగా చెయ్యమని.
శివుడు సరే అని శరభుడుగా వచ్చి స్వామికి అడ్డుగా నుంచున్నారు. ఆయన మీదకే నృసింహస్వామి కోపంగా దూసుకుని వెళ్ళారు. శరభుడి చేతిలో ప్రత్యంగిరాదేవి కూర్చుని ఉంది. శివుడి మీదకే స్వామి కోపంగా రావడంతో లేచినుంచుంది కోపంతో.
ఆవిడ " సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్....." - వేల శిరస్సులు, ఎర్రటి వేలకళ్ళు, ఆయుధాలతో కూడిన వేల చేతులు. కోపంతో హుంకరించేటప్పటికి నృసింహస్వామి భయపడిపోయి చల్లబడిపోయాడు.
ఆవిడ " అయ్యో ఎదురుగా ఉన్నది నా సోదరుడు, ఎలా కోప్పడేదీ " అనుకోలేదు. అనుకుంటే స్వామి ఉగ్రంలోంచి బయటకు రాడు, లోకాలూ తల్లడిల్లిపోతాయి.
ఉగ్రనృసింహస్వామి, ప్రత్యంగిరాదేవిల రూపాలను ఊహించుకుంటే అమ్మవారిది ఎంత పెద్దరూపమో తెలుస్తుంది.
అవసరమయినప్పుడు అటువంటి భయంకరమయిన పెద్ద రూపాన్ని కూడా ధరిస్తారు అమ్మవారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment