అమ్మవారు మంగళస్వరూపురాలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భద్రమూర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 116 వ నామం.
" భద్రమూర్తిః " అంటే మంగళప్రదమగు స్వరూపము గలది. అమ్మవారి వదనం శుభకరం, చూపులు శుభకరం, వాక్కు శుభకరం. అభయమిచ్చే చేతులు శుభకరం. ముక్తినిచ్చే పాదాలు శుభకరం.
శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తాం:
" సర్వమంగళమాంగల్యే
శివే సర్వార్థ సాధికే .
శరణ్యే త్రయంబకే దేవి
నారాయణి నమోస్తు తే "
" అన్ని శుభాలలోకెల్లా శుభప్రదమైన, స్వయంగా శుభప్రదమైన, అన్ని శుభగుణాలతో సంపూర్ణమైన, మరియు భక్తుల అన్ని లక్ష్యాలను (పురుషార్థాలు - ధర్మం, అర్థం, కామ మరియు మోక్షం) నెరవేర్చే తల్లి లక్ష్మీదేవికి నమస్కారం. మూడు కన్నులు కలిగిన, ఆశ్రయదాత అయిన ఓ నారాయణీ నీకు నమస్కారం " అని.
ధర్మరాజు భీష్ముని అడుగుతాడు " తాతా, విష్ణుసహస్రనామాలు ఇంత అద్భుతంగా ఎలా చెప్పావు " అని. భీష్ముడు " పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం - పవిత్రులలో కెల్లా పవిత్రుడు, మంగళాలలో కెల్లా మంగళస్వరూపుడు విష్ణువు. ఆయన నామాలు అద్భుతంగా ఉండకుండా ఎలా ఉంటాయి " అని అంటారు.
ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రంలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:
" ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథల మౌక్తిక శోభి నాసం
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశమ్ "
" పద్మము వంటి ముఖము, దొండపండు వంటి క్రింది పెదవి, ముత్యపు ముక్కెరతో అలంకరించబడిన ముక్కు,
చెవులదాక విస్తరించిన కన్నులు, మణులు పొదిగిన చెవికుండలాలు,
చిరుమంద హాసం, నుదురుపై కస్తూరి మరియు ఇతర జంతు మదజలంతో చేయు తిలకం లతో దర్శనమిస్తూన్న లలితమ్మవారిని ప్రాతఃకాలమున ధ్యానించుచున్నాను " అని. ఎంతటి అద్భుత భావన. మంగళస్వరూపురాలు.
ఇటువంటి రూపభావనతోనే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతుల వంటి వారిని దర్శనం చేసుకుంటేనే మనస్సు ప్రశాంతతను పొందుతుంది. ఇక అమ్మవారి దర్శనం వలన కలిగే భాగ్యాన్ని వర్ణించగలమా.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment