అమ్మవారు లావణ్యముల గని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మహాలావణ్యశేవధిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 48 వ నామం.

" మహాలావణ్యశేవధిః " అంటే గొప్ప సౌందర్యమునకు గని అయినట్టిది అని భాష్యం చెప్పారు. సౌందర్యం అంటే బాహ్య సౌందర్యమే కాదు. మాట, చేతలు, చూపులు అన్నీ ఆహ్లాదంగా ఉండాలి. ఇటువంటి లావణ్యాలన్నిటినీ తన భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తారు.

మూకపంచశతి లోని స్తుతిశతకంలో కామాక్షీదేవిని మూకశంకరులు ఇలా స్తుతిస్తారు:

" సరసవచసాం వీచీ నీచీ

  భవన్మధుమాధురీ

  భరితభువనా కీర్తిర్మూర్తి

  ర్మనోభవజిత్వరీ,

  జనని మనసో యోగ్యం 

  భోగ్యం నృణాం తవ   

  జాయతే కథమివ వినా  కాంచీ 

  భూషే కటాక్షతరంగితమ్ " - 21

" తరంగించు తేనె తీపిగల సరసవాక్కు, లోకముల నిండిన కీర్తి, మన్మధునోడించు రూపు, మనసునకు తగిన భోగ్యము, మనుషులకు అమ్మవారి కటాక్షము సోకనిదే ఎట్లు కలుగును? " అని. అంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించినవారికే ఇటువంటి అమృతవాక్కు, చక్కని రూపు, కీర్తి, భోగములు లభిస్తాయని మూకశంకరుల అభిప్రాయం. ఇవేమీ లేనివారు క్రితం జన్మలో అమ్మవారి పాదాలను ఆశ్రయించలేదని అర్ధం. 

కృష్ణపరమాత్మ త్రివర్క ( మూడు వంకరలు ) అని పిలువబడే కుబ్జ ఇచ్చిన లేపనం కొద్దిగా తీసుకుని తన శరీరానికి రాసుకుని, బాగుంది అని మెచ్చుకుని, ఆవిడ చుబుకాన్ని తన కుడిచేయి మధ్యవ్రేళ్ళతో ప్రేమగా అలా పైకి ఎత్తారు. అంతే ఆవిడ నిటారుగా, అతి సుందరంగా అయిపోయింది. పులకించి పోయి కన్నీళ్ళతో కృష్ణుడి పాదాలపై పడింది. అలా అద్భుత లావణ్యాలను అనుగ్రహిస్తారు తన అనన్యభక్తులకు. లావణ్యాల గని.

శ్రీవల్లభాచార్యులు మధురాష్టకంలో ఇలా స్తుతిస్తారు:

" అధరం మధురం వదనం మధురం

  నయనం మధురం హసితం మధురమ్,

  హృదయం మధురం గమనం మధురం

  మధురాధిపతేరఖిలం మధురమ్ " - 1

అన్నీ మధురమే. అమ్మవారే మూర్తీభవించిన లావణ్యం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ