దేవీదేవతలకు ఎవరికి పూజ చేసినా అమ్మవారికి పూజ చేసినట్లే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సమానాధికవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 198 వ నామం 

" సమానాధికవర్జితా " అంటే సమానము, అధికము చేతను విడువబడినది. తనతో సముడుగాని అధికుడుగాని లేనిది అని అర్థం.

సృష్టినంతటిని ఇంత అద్భుతంగా దోషరహితంగా నడుపుతూన్న అమ్మవారికి సాటి ఎవరుంటారు. ఇక అధికులు ఉండడానికి అవకాశమెక్కడిది.

పోతనగారు భాగవతంలో " అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ ......" అని కీర్తించారు. అమ్మవారే అన్నిటికీ మూలం.

ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ ఇలా ప్రార్థిస్తారు:

" త్రయాణాం దేవానాం   

  త్రిగుణ జనితానాం తవ శివే

  భవేత్పూజా పూజా తవ 

  చరణాయోర్యా విరచితా,

  తథాహి త్వత్పాదోద్వహన

  మణిపీఠస్య నికటే

  స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత

  కరోత్తంసమకుటాః " - 25

" ఓ! శుభప్రదమైన పరాశక్తి, నీ పవిత్ర పాదాలను పూజించినప్పుడు, ఆ ఆరాధన నీ ముగ్గురు గుణాల స్వరూపులైన బ్రహ్మ, విష్ణు, శివులను పూజించినట్లు అవుతుంది, వారు ఎల్లప్పుడూ నీ రత్నంతో అలంకరించబడిన పాదపీఠానికి దగ్గరగా ఉండి, తమ చేతులను కిరీటములపై పెట్టుకుని ఉంటారు " అని.

ఈ శ్లోకానికి ఓ చక్కటి భాష్యం చెప్పారు. త్రిమూర్తులతో బాటు వివిధ దేవీదేవతలను పూలతో పూజిస్తూంటాం మనం. పూలు దేవతలమీద పడతాయి కదా. మరి దేవతలు అందరూ ఎక్కడ ఉన్నారు. అమ్మవారి పాదాలవద్ద. అంటే దేవతల శిరస్సుమీద పడ్డ పూవులన్నీ అమ్మవారి పాదాలమీద పడుతున్నాయని భావం. అంటే ఏ దేవీదేవతలను పూజించినా అమ్మవారిని పూజించినట్లే అని. ఎంత అద్భుతమైన విషయం.

అలా దేవతలు అందరూ అమ్మవారి పాదాలను సేవిస్తూంటే అమ్మవారికి సాటి అయిన వారే ఉండరు, మరి అధికులెలా ఉంటారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అనుగ్రహించమని వేడుకుందాం అందరం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ