అమ్మవారు మంగళకార్యాలను ఇష్టపడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 

" భద్రప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 115 వ నామం. 

" భద్రప్రియా " అంటే మంగళములు ఇష్టముగా గలది అని భాష్యం చెప్పారు. అమ్మవారు మంగళప్రదాయిని. మంగళములను ప్రసాదిస్తారు. మంగళములములను పొందేవారిని చూసి మురిసిపోతారు.

ఓ ఉపాధ్యాయుడు తరగతిలో ఉన్న 40 మందికీ పాఠం చెబుతారు. కొందరు ఆయన చెప్పినది గ్రహించి సాధన చేసి మంచి ఫలితాలు పొందుతారు. సహజంగానే ఉపాధ్యాయుడు అలా మంచి ఫలితాలు పొందిన వారిని చూసి మురిసిపోతారు, వారిని మెచ్చుకుంటారు. ఓ ఉపాధ్యాయుడే అలా ఆనందపడితే అమ్మవారు ఎంత మురిసిపోతారు సన్మార్గంలో నడిచే తన భక్తులను చూసి. 

శుక్ల యజుర్వేదం, ముండకోపనిషత్తులో ప్రార్ధన కోసం ఓ అద్భుతమైన శ్లోకం ఉంది:

" ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః

  భద్రం పశ్యేమాక్షభి ర్యజత్రాః స్థిరై రంగై  

  స్తుష్టువాగ్ంసస్తనూభిః వ్యశేమ దేవహితం   

  యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః

  స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో   

  అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు "

" ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానినే వినెదము గాక. పూజనీయులారా, మా నేత్రములతో శుభప్రథమగు దానినే దర్శించెదము గాక. మిమ్ములను స్తుతించుచు మా కొసగబడిన ఆయుష్కాలమును పూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదము గాక. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము నొనగూర్చు గాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయు గాక. ఆపదలు, చెడు నుండి కాపాడు గరుడుడు మాకు శుభమును అనుగ్రహించు గాక. మా లోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించు గాక‌ " అని.

ఇటువంటి భావనతో ఉండేవారికి అన్నీ శుభాలే జరుగుతాయి. గతజన్మ కర్మఫలాలవల్ల ఏదయినా అశుభం జరిగినా వారు కలవరపడరు. అది కూడా తన పాపప్రక్షాళన కోసం అమ్మవారి ఏర్పాటే అని భావించి ప్రశాంతంగా ఉంటారు. అటువంటి వారిని అమ్మవారు ఇష్టపడుతారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే సకలశుభాలను కలుగచేస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ