అమ్మవారిని కుంకుమతోనూ ఎర్రటి పూలతోనూ పూజిస్తాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సర్వారుణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 49 వ నామం.
" సర్వారుణా " అంటే అన్నింటియందు ఎర్రని కాంతి కలది అని భాష్యం చెప్పారు. అమ్మవారు ఎర్రటి రంగులో మెరిసిపోతూ ఉంటారు. దుర్గా సూక్తంలో " తాం అగ్నివర్ణాం " అని ప్రార్ధిస్తాం. ఎర్రటి చీర ధరించిన అమ్మవారు ఎర్రని బొట్టు, తాంబూలం సేవనం, చేతికి గోరింటాకు, కాళ్ళకు ఎర్రటి పారాణితో కళకళలాడుతూ ఉంటారు.
అమ్మవారిని కుంకమతోనూ, ఎర్రటి పూలతోనూ పూజిస్తాం.
సూర్యభగవానుడిని మేల్కొలుపుతూ:
" గుంకుతూ భానుడు
గుమ్మడి పూఛాయ
గుమ్మడీపువ్వు మీద
కుంకంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ " అని ప్రార్థిస్తాం.
ఒక్కోసారి సాయంత్రం ఆకాశమంతాఎర్రటి రంగుతో నిండిపోయి ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:
" తనుచ్ఛాయాభిస్తే తరుణ
తరణి శ్రీసరణిభిః దివం
సర్వాముర్వీమరుణిమ
నిమగ్నాం స్మరతి యః, భవంత్యస్య
త్రస్యద్వనహరిణ శాలీననయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి
న గీర్వాణగణికాః " - 18
" ఓ జగజ్జననీ! ఉదయించుచున్న బాలసూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యమును పోలిన నీ దివ్యదేహపు కాంతులతో ఈ సమస్తమైన ఆకాశము, భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి బెదురు చూపులతో ఉండు లేడి వంటి కన్నులను కలిగిన దేవలోకంలో అప్సరస స్త్రీలు ఊర్వశితో సహా వశులవుతారు " అని.
దీనిలో అద్భుతమయిన అంతర్భావం ఉంది. అప్సరసలు దేవతలు. కనురెప్పలు మూతబడవు. మరి బెదురు చూపులు ఏమిటి. అమ్మవారి ఎర్రని దివ్యదేహపు కాంతితో భూమ్యాకాశాలు నిండిపోయినట్లుగా ఆనందిస్తూ అమ్మవారిని ధ్యానించే సాధకుడు కూడా అటువంటి కాంతితో వెలిగిపోతూ ఉంటాడు అమ్మవారి అనుగ్రహం వల్ల. అప్సరసలు ఎల్లవేళలా అమ్మవారిని చూడలేరు కనుక ఈ సాధకుని వెంట పడుతారు ( వశమవుతారు ) అని భావం. అప్సరసలే వశమయినప్పుడు మానవకాంతలేపాటి, వారూ వెంటపడుతారు. కాని అమ్మవారి అరుణకాంతిని ధ్యానం చేసే సాధకునికి ఈ అప్సరసలు, మానవకాంతలు సూర్యుని ముందు దివిటీలలా అనిపిస్తారు కనుక ఈయన పట్టించుకోరు అని గ్రహించాలి.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఈరోజు భాను సప్తమి - అలభ్యయోగం. అమ్మవారి నామజపం విశేష ఫలితం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment