మన బుద్ధి ఏది ఆలోచిస్తుందో అదే మన భవిష్యత్తు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సర్వవేదాంతసంవేద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 645 వ నామం.

" సర్వవేదాంతసంవేద్యా " అంటే ఉపనిషత్తులన్నిటిచేతా చక్కగా తెలియదగినది. 

ఉపనిషత్తులను వేదాంతం, వేదాంగాలు అని తెలియచేసారు . ఉపనిషత్తులు జ్ఞానకాండ. ఉప అంటే దగ్గరగా, బ్రహ్మ తత్వానికి/జ్ఞానానికి దగ్గరగా తీసుకుని వెడతాయి ఉపనిషత్తులు. కాని అది అంత సులభం కాదు. గతజన్మ వాసనలు వెనక్కిలాగేస్తూంటాయి. ఈ వాసనలనీ, చెడు ఆలోచనలనూ నశింపచేస్తాయి ఉపనిషత్తులు. ఉపనిహంతి.

బుద్ధి ఏమి ఆలోచిస్తుందో అదే మన భవిష్యత్తు. విషయాలోచన చేస్తే విషయాలలో పడతాం, భగవత్స్మరణ చేస్తే భగవంతుడవుతాం. ఈ స్మరణం ఎంతవరకూ అన్నది ప్రశ్న. దానిలో " స్ " పోయేవరకూ అన్నారు పూజ్యులు సామవేదంవారు. స్మరణం ( స్+మరణం )లో స్ పోతే మిగిలేది మరణం.‌ అంటే మరణం వరకూ భగవంతుని స్మరిస్తే భగవంతునిలో లీనమవడం తథ్యం.

శుకుడు భాగవతసప్తాహం చేసారు, పరీక్షిత్తు విష్ణువు సన్నిధికి చేరారు. ఏడు రోజులు భాగవతం విని ముక్తి పొందాడు పరీక్షిత్తు అనిపిస్తుంది కాని ఆయన మరణం పొందేవరకూ భాగవతం విన్నారు అని తెలుసుకోవాలి.

శుకమహర్షి చెప్పిన భాగవతంలో ఎక్కడా రాధాదేవి పేరు వినబడదు. ఏ గోపిక పేరూ కూడా వినబడదు. రాధాదేవి ఆనందప్రదాయిని. ధ్యానయోగరూపిణి. ఆవిడ పేరు నోటితో పలికితే శుకులు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ బయటకు రావడానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. మరి పరీక్షిత్తుకు ముక్తి ఎలా. అందుకే శుకులు రాధాదేవి పేరును ఉచ్ఛరించకుండా జాగ్రత్త పడ్డారు అని అభిప్రాయపడ్డారు పండితులు. " ఆమె, ఆమె యొక్క, ఆమెతో " అనే పదాలే కనబడుతాయి భాగవతంలో.

భక్తజయదేవులు కూడా తన అష్టపదిలో " యా రమితా వనమాలినా... " అంటారు. స్త్రీ, ఆమె, వనిత అనే అర్ధాలు వచ్చేలా. ఎక్కడా రాధాదేవి అనలేదు. అంటే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఏదీ వ్రాయడం కుదరదు. మనకు తరింపచేసే అద్భుత కావ్యాలు వచ్చి ఉండేవి కావు.

అన్ని ఉపనిషత్తులు తెలియచేసిన పరమసత్యమే అమ్మవారు, వేదాలసారం, వేదమాత. ఉపనిషత్తుల పారాయణ/శ్రవణం అమ్మవారిని స్మరించడమే.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ