అమ్మవారు వివిధ రూపాలలో అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బహురూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 824 వ నామం .
" బహురూపా " అంటే అనేక రూపములు గలది అని భాష్యం చెప్పారు.
దేవీపురాణం ఈ విషయాన్ని " పరమాత్మస్వభావముచే రూపము లేనిదయినను క్రియాస్వభావముచే అనేక రూపములు ధరించును " అని వివరించింది. అంటే చేయవలసిన పనిని బట్టి తగిన రూపాన్ని ధరిస్తారు అని. వేదం అనేక వేల రుద్రులు ఉన్నారని తెలియచేసింది. మరి ఒక్కో రుద్రునికి ఒక అమ్మవారిగా అనేక రూపములతో భాసిస్తున్నట్లు తెలుస్తూంది.
దేవీపురాణమే ఇంకో విషయం తెలియచేసింది. చరములు స్థిరములు దేవతలు మనుష్యులు పశుపక్ష్యాదులు అన్నీ అమ్మవారి రూపములే కదా. అందుకని బహురూపా అని పూజిస్తున్నాం అని.
సూతసంహిత చక్కటి వివరణ ఇచ్చింది. అక్షరములన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. ఒక్కో అక్షరానికి ఓ దేవతా స్వరూపంగా అమ్మవారు అనేక రూపములతో భాసిస్తున్నారు అని. అక్షరం అంటే నాశనము లేనిది అని. అక్షరాలకు ( చదువుకు ) అంతటి పవిత్రతను ఇచ్చింది సనాతనధర్మం.
ఈ నామంని అర్ధం చేసుకోవడానికి హిరణ్యకశిపుని వధని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రహ్లాదుడిని మార్చలేక విసిగిపోయిన హిరణ్యకశిపుడు " ఎక్కడ నీ విష్ణువు " అని అడిగాడు ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడు అన్నాడు:
" ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి
సర్వోపగతుండు ఎందెందు
వెదకి చూచిన అందందే
గలడు దానవాగ్రణి వింటే "
" విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు. ఆయన అన్నిచోట్లా ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు. ఓ రాక్షసరాజా! ఇది సత్యం " అని.
హిరణ్యకశిపుడు పెద్ద స్తంభం చూపెట్టి ఇందులో ఉన్నాడా అని దానిని కొట్టడంతో దానిలో నుంచి ఉగ్రనరసింహస్వామి రావడం జరిగింది. అదే ఏ చిన్న వస్తువో చూపెట్టి ఉంటే స్వామి ఏరూపంలో వచ్చి ఉండేవారో. బహురూపధారి విష్ణువు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment