సత్యమే లోకాన్ని ధర్మమార్గంలో నడిపిస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సత్యజ్ఞానానందరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 791 వ నామం.
" సత్యజ్ఞానానందరూపా " అంటే సత్యము, జ్ఞానము, ఆనందములు రూపముగా గలది అని భాష్యం చెప్పారు.
ధర్మము యొక్క నాలుగు పాదాలలో మొదటిది సత్యం.
జాబాలి దశరధుని సలహాదారు. శ్రీరాముని అరణ్యవాసం మానిపించి ఎలాగయినా అయోధ్యకు తీసుకుని వెళ్ళాలని భావించి " శ్రీరామా, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, తండ్రికి మాట ఇవ్వడం ఏమిటి " అన్నప్పుడు శ్రీరాముడు ఇలా తెలియచేసారు:
" సత్యమేవేశ్వరో లోకే
సత్యం పద్మాశ్రితా సదా,
సత్యమూలాని సర్వాణి
సత్యాన్నాస్తి పరం పదా "
" సత్యమే లోకాన్ని నడుపుతూన్న పరమేశ్వరుడు. సత్యాన్ని ఆశ్రయించే ఐశ్వర్యం ఉంటుంది. సర్వ ధర్మములు సత్యమూలములు " అని శ్రీరాముడు జాబాలిమహర్షి తో అంటారు. అంతటి సత్యనిష్టాపరుడు శ్రీరాముడు.
రామకృష్ణపరమహంస " ఈ కలికాలంలో యజ్ఞాలు, పూజలు, తపాలు, జపాలు మొగునవి శ్రమతోనూ ఖర్చుతోనూ కూడుకున్నవి అవడంవలన చెయ్యడం కష్టమే కనుక వీలయినంతవరకూ సత్యం మాట్లాడడమే ముఖ్యమైన వ్రతం " అన్నారు.
అమ్మవారి రూపాన్ని కాని నామాన్ని కాని ధ్యానం చేసుకంటే అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది తల్లి. జ్ఞానరూపిణి.
అమ్మవారు ఐదు రూపాలలో అనుగ్రహిస్తారు జీవులను. పార్వతి ( శక్తి ), లక్ష్మి ( సంపద ), సరస్వతి ( జ్ఞానం ), రాధాదేవి ( ప్రేమ/ఆనందం ), సూర్యమండలాంతర్వర్తి అయిన గాయత్రీదేవి ( ప్రాణశక్తి ). జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి బ్రహ్మానందాన్ని కలిగించేవారు రాధాదేవి. ఆనందరూపిణి, ప్రేమరూపిణి.
పూజ్యులు సామవేదంవారు " జీవులకు జన్మనిచ్చిన తల్లులందరిలోనూ ఈ ఐదుగురు అమ్మవార్లు స్థితులై ఉంటారు " అని తెలియచేసారు.
అందుకే ఆదిశంకరులు " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి - చెడ్డ తల్లి ఉండదు కదమ్మా " అని ప్రార్థించారు దేవీ అపరాధ క్షమాస్తోత్రంలో.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment