అమ్మవారు అనవసరపు బంధాలను తొలగిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏""శ్రీమాత్రేనమః"🙏
" జ్ఞానవిగ్రహా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 644 వ నామం.
" జ్ఞానవిగ్రహా " అంటే జ్ఞానమే శరీరముగా గలది అమ్మవారు అని. జ్ఞానం కలగడం అంటే అజ్ఞానాంధకారం తొలగడం. అమ్మవారి దర్శనంతో లేక ధ్యానంతో అజ్ఞానం తొలగి జీవితం ఆనందదాయకం అవుతుంది. దీపశిఖతో చీకటి తొలగునట్లు అమ్మవారి దర్శనంతో/ధ్యానంతో అజ్ఞానం తొలగుతుంది.
" జ్ఞానానంద మయందేవం
నిర్మల స్ఫటికాకృతిం,
ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే "
" అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవునికి నమస్కరిస్తున్నాను " అని పై శ్లోకానికి అర్థం. హయగ్రీవ అవతారంలో శ్రీమహావిష్ణువు వేదాలను ఉద్ధరించారు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయారు. జ్ఞానమే స్వామి.
ధర్మరాజుని యక్షుడు " మానవజీవితంలో అత్యంత ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటి " అని అడుగుతాడు. ధర్మరాజు అంటాడు " తన కళ్ళముందే తన వారందరూ ఒక్కొక్కరే మరణిస్తూన్నా తను మాత్రం శాశ్వతం అనుకుంటాడు, సంపదను కూడబెట్టడం వంటి పనికిమాలిన పనులు చేస్తూనే ఉంటాడు మనిషి " అని. ఇదే అజ్ఞానం అంటే. ఇది తొలగుతే అంతా పరమానందమే.
ఆదిశంకరులు ఓసారి కాశీలో ఉన్నప్పుడు ఓ వృద్ధుడు " వ్యాకరణ సూత్రాలు " వల్లెవేయడం చూసి ఆశ్చర్యపోయి " ఓ మందమతీ, మరణానికి చేరువయిన నీకు మరణసమయంలో ఈ వ్యాకరణసూత్రాలు ముక్తిని ఇవ్వవు. గోవిందనామ స్మరణచేసుకుని తరించు " అని చెబుతూ అద్భుతమయిన జీవితపరమార్ధాన్ని తెలియచేసే " భజగోవిందం ( మోహముద్గరం )" ని అనుగ్రహించారు మనవంటి సామాన్యులకు.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అవసరమయిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. సందేహం అక్కరలేదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment