కొద్దిగా దోషంగా అనిపించినా పరధర్మం కన్నా స్వధర్మమే మేలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్,
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః "
- భ.గీత 3:35
" పరధర్మమును చక్కగా నిర్వహించుటకన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది. దానిని పాటించుటకన్నను స్వధర్మపాలనమునందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనది " అన్నారు పరమాత్మ.
హిందూమతం అంటూ మాట్లాడుతూ ఉంటారు అందరూ. హిందూధర్మం అనే చెప్పారు మన పెద్దలు. మతం అంటే అభిప్రాయము అని అర్ధం. ఇది మా అభిప్రాయం, దాని మంచిచెడ్డలు గురించి ఆలోచించు, మంచిది అనుకుంటే పాటించు, లేదూ వదిలేయ్ అన్నారు.
సనాతనధర్మం, ఆర్షధర్మం, భారతీయధర్మం, వైదికధర్మం - ఇవన్నీ హిందూధర్మములు.
శ్రీరాముడు " ఋషులు ఇలా చెబుతున్నారు, వేదం ఇలా చెబుతూంది, శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి " అనేవారు ఎల్లప్పుడూ.
కృష్ణపరమాత్మ కూడా " ఇది పండితులు/శాస్త్రములు చెబుతూన్న విషయం " అని చెబుతూ " ఇది నా అభిప్రాయం " అని తెలియచేసారే కాని " ఇలాగే చెయ్యి " అనలేదు.
కొన్ని దేశాలలో/ప్రాంతాలలో " స " అక్షరంని " హ " గా పలుకుతారు. సింధునదీ ప్రాంతంవారిని సింధూ అనడానికి బదులు హిందూ అనడం వలన హిందూ పదం వాడుకలోకి వచ్చింది. వ ( వంగ ) అన్నది బ ( బంగ ) అయినట్లుగా సిం అన్నది హిం అయింది.
ఋషులు కొన్ని విషయాలను ఆలోచనచేసి ఆచరించి, అద్భుత ఫలితాలను పొంది ఇలా చేస్తే అందరికీ మంచిది అని తరువాత తరాలకు తెలియచేసారు. అదే మన సనాతనధర్మం, సంప్రదాయాలు. వారు తెలియచేసినట్లుగా చేయడంవలన లాభమే కాని నష్టమనేది ఉండదు. పచ్చకామెర్ల వారికి అంతా పచ్చిగానే కనబడినట్లు కొందరు మూఢులకు మన సనాతనధర్మం/సంప్రదాయాలు చెడుగానూ పనికిరానివిగానూ అనిపిస్తూంటాయి. దోషం వారిలో ఉంది కాని సనాతనధర్మంలో కాదు.
గులాబీ పువ్వు ఎంతో అందంగా ముచ్చటగా ఉంటుంది. కాని కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. క్రింద ముళ్ళు ఉంటాయి. గ్రుచ్ఛుకుంటాయి. జాగ్రత్తగా కోసి అరచేతిలో పెట్టుకుంటే దాని అందానికి, పరిమళానికి మనస్సుకు ఆనందం కలుగుతుంది. ముళ్ళు ఉన్నాయని అందమైన గులాబీని వదిలేసుకోకూడదు.
మంచి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా చెడుగా అనిపించినా చెడును ప్రక్కన పెట్టి మంచిని ఆచరించి బాగుపడాలి.
ఈరోజు మతత్రయ ఏకాదశి. పవిత్ర దినం.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment