పద్మం సృష్టికర్త బ్రహ్మ కన్నా ముందు పుట్టింది, అందుకే పవిత్రమైనది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నళినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 460 వ నామం .

" నళినీ " అంటే కమలరూపములయిన కరచరణాదులు గలది అని భాష్యం చెప్పారు. 

మన సనాతన వాజ్మయంలో పద్మానికి ఓ విశిష్ట స్థానం ఉంది. సృష్టి చేసేది బ్రహ్మ కదా. ఆయనకు పద్మసంభవుడు అని పేరు.‌ అంటే పద్మంలో పుట్టారు అని. అంటే పద్మం సృష్టికి పూర్వమే ఉన్నట్లు తెలుస్తూంది. అందుకే పద్మానికి అంత పవిత్రత. బురదలో పుట్టి నీటిలోనే పెరుగుతుంది. బురద, నీరు దానికి అంటవు. సూర్యకిరణాలకు విక‌సిస్తుంది‌. సూర్యుడు పద్మప్రియుడు.

దేవీదేవతలు పద్మంమీద కూర్చున్నట్లు, చేతిలో పద్మాన్ని ధరించినట్లు కీర్తిస్తాం, చూస్తూంటాం.

శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తాం:

" పద్మాననే పద్మ ఊరూ

   పద్మాక్షీ పద్మసంభవే 

   త్వం మాం భజస్వ పద్మాక్షీ 

   యేన సౌఖ్యం లభామ్యహం "

పద్మము నుండి పుట్టినదానా, పద్మం వంటి ముఖము, కనులు కలిగిన దానా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్ధిస్తాం.

" పద్మప్రియే పద్మిని పద్మహస్తే 

  పద్మాలయే పద్మదళాయతాక్షీ,

  విశ్వప్రియే విష్ణుమనోనుకూలే  

  త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ "

" పద్మమంటే ఇష్టపడేదానా, పద్మకుమారి, చేతిలో పద్మం ధరించినదానా, పద్మంలో కూర్చున్నదానా, పద్మరేకులవంటి విశాలమయిన కనులు గలదానా నీ పాదపద్మములను నన్ను ప్రార్ధించనీ " అని ప్రార్ధిస్తాం. 

అమ్మవారి శరీరమే పవిత్రము, కోమలము, సుందరమగు పద్మం.

18 పురాణాలలో ఒక పురాణానికి పద్మపురాణం అని పేరు. దానిలో సృష్టిక్రమం, భూగోళశాస్త్ర సంబధిత అద్భుత విషయాలు తెలియచేసారు.

రమణమహర్షి " అరుణాచల పరమాత్మన్ అరుణోభవ, చిత్తకంజ సువికాశాయ " అని ప్రార్ధన చేసేవారు. " మా హృదయపద్మం మొగ్గలా ముడుచుకుపోయింది స్వామీ. నీ కరుణ అనే అరుణకిరణాలను ప్రసరించి అది విచ్చుకునేలా చెయ్యి తండ్రీ ( సూర్యకిరణాలు సోకితే పద్మం వికసిస్తుంది ) " అని ప్రార్ధించేవారు. చిత్తకంజ అంటే హృదయపద్మం.

శంకరాచార్యులు శివానందలహరి గానం చేస్తూ ఇలా ప్రార్థిస్తారు:

" గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే

  విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః,

  సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ 

  భవతే సుఖేనావస్థాతుం జన ఇహ 

  న జానాతి కిమహో " - 9

" మనుష్యుడు తెలివితక్కువ వాడై పుష్పముల కొరకు లోతైన చెరువు లందు దిగుచున్నాడు, జనులు లేని భయంకరమైన అరణ్యములందునూ, విస్తీర్ణమైన పర్వతములందు తిరుగుచున్నాడు. కానీ ఓ పార్వతీపతీ, మనస్సనెడి పద్మము ఒక్కటే నీ పాదములయందు సమర్పించిన చాలు సుఖముగా ఉండవచ్చన్న విషయాన్ని, ఈ జడులైన మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారే, ఆశ్చర్యంగా ఉంది " అని.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ