అమ్మవారి తేజస్సు మన అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పరంధామా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 807 వ నామం.

" పరంధామా " అంటే ఉత్కృష్టమైన తేజోరూపురాలు అని భాష్యం చెప్పారు. ధామం అంటే వెలుగు. సూర్యుడు వెలుగునిస్తాడు అంటే సూర్యుడు వెలుగు వేరని కాదు. సూర్యుడే వెలుగు. అలాగే అమ్మవారే తేజస్సు. 

కఠోపనిషత్తు " ఆత్మను సూర్యచంద్రాదులు కూడా ప్రకాశింపజేయజాలరని, అది స్వయం ప్రకాశమైనదని, జీవి శరీరంలో ఉన్నప్పుడు అంగుష్టమాత్రంగా హృదయకుహరంలో జ్యోతి వలె ఉంటూ శరీరం మొత్తాన్ని చైతన్య పరుస్తుంది " అని తెలియచేస్తూంది. ఆత్మ అమ్మవారి చైతన్యం. నైతికవిలులతో జీవించేవారికి, భక్తులకు శరీరం చుట్టూ కాంతివలయం కొంచెం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తూంది. మరి సామాన్యజీవుడి శరీరమే కాంతివంతంగా ఉంటే మరి అమ్మవారు ఎంత తేజస్సుతో వెలిగిపోతూంటారు. 

రాసలీల ప్రారంభానికి ముందు ఓ అద్భుత విషయం జరిగింది:

కృష్ణుడికి రాసలీల ప్రారంభసమయంలో మన్మధుడు కనిపించాడు అక్కడ. " నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి " అని కృష్ణుడు అడిగితే మన్మధుడు " బ్రహ్మాది దేవతలను, ఇంద్రుడిని కూడా జయించేసాను. మిమ్మల్ని కూడా జయించేస్తే నాకు తిరుగులేదు కదా " అంటాడు. " శివుడిని జయించలేదుకదా నువ్వు " అని కృష్ణుడు అంటే అప్పుడు ఆయన తపస్సులో ఉండడంవల్ల కుదరలేదు అంటాడు. రాముడిని కూడా ముట్టుకోలేకపోయావు కదా అంటే ఆయన ఏకపత్నీవ్రతుడు కదా అంటాడు. మరి ఇప్పుడు " ఈ ధైర్యం, ఆలోచనా ఎలా వచ్చింది నీకు " అని అడిగితే " గోపస్త్రీ పరివేష్టితో - మీ చుట్టూ గోపికలు ఉన్నారు కదా " అందుకని ఆశ అంటాడు. సరే ప్రయత్నం చేసుకో అంటారు కృష్ణుడు.

చెట్టు చాటున నుంచుని రాసలీల మొదలవగానే కృష్ణుడి మీద బాణం వేద్దామని చూస్తే స్త్రీపురుషులు ఇద్దరూ ఉన్నారు అక్కడ.‌ ఎవరిమీద వెయ్యాలి బాణాలు అని చూస్తూంటే ఓ పెద్ద కాంతిపుంజం కనిపించింది. అందులో పాశం, అంకుశం, చెరుకుగడవిల్లు, పుష్పబాణాలు ధరించిన అమ్మవారు లలితాదేవి కనిపించారు. చుట్టూ అనంగసేన, అనంగమాలిని, మదయంతి, బాల మొ.గు అమ్మవార్లు కూడా కనిపించడంతో మన్మధుడికి మతిపోయింది. విల్లు బాణాలను క్రింద పడవేసి అమ్మవారి పాదాలపై పడిపోయాడు. ఆ అమ్మవారు రాధాదేవి, రాసమండల నాయిక. అమ్మవారు తేజోరూపిణి.

అమ్మవారి రూపమును, గుణగణాలను, శక్తులను కీర్తిస్తూ కఠిన సాధన చేయగా చేయగా అమ్మవారు కాంతిపుంజంగా దర్శనమిస్తారు అని తెలుసుకోవాలి.

" దివి సూర్యసహస్రస్య 

  భవేద్యుగపదుత్థితా "

           - భ.గీత 11:12

ఆకాశమునందు వెయ్యిసూర్యులు ఒకేసారి ఉదయించినట్లుగా ఉన్నారుట పరమాత్మ విశ్వరూపంలో. మరి అమ్మవారు ఎంత తేజస్సుతో ఉంటారో ఊహించుకోవచ్చు.

అమ్మవారి తేజస్సు మన అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. జీవితాన్ని ఆనందమయం చేస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ