అమ్మవారికి సాక్షి అవసరం ఏముంటుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సాక్షివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 385 వ నామం.
" సాక్షివర్జితా " అంటే తనకు వేరొక సాక్షిలేనిది అని భాష్యం చెప్పారు.
సాక్షి అవసరం అసలు ఎందుకు వస్తుంది. తను తప్పు చేయలేదు అని నిరూపించు కోవడానికి లేక ఇంకొకరు తప్పు చేసారు అని నిరూపించడానికి. అమ్మవారికి తప్పు చేయవలసిన అవసరం ఏముంటుంది. ఇంకొకరినుంచి ఏదయినా ఆశించి అది దక్కకపోతే తప్పు చేస్తారు. సృష్టి అంతా అమ్మవారిదే అయినప్పుడు వారు ఆశించేదేముంటుంది. అమ్మవారు పొందిందీ లేదు, పొందవలసినదీ లేదు, పొందలేనిదీ లేదు. అమ్మవారు తప్పూ చేయరు, ఎవరైనా అమ్మవారి పట్ల తప్పుచేసినా అమ్మవారికి సాక్షి అవసరం లేదు. తప్పు చేసినవాడే ఒప్పుకొనేటట్లుగా చేసి శిక్షిస్తారు. అంతటి సమర్ధురాలు.
సాక్షుల గురించి గరుడపురాణం విస్తారంగా ప్రస్తుతించింది. జీవుల ( మన ) కర్మలన్నిటినీ అమ్మవారు నియమించిన సాక్షులు గమనిస్తూ ఉంటారు.
" ఆదిత్య చంద్రౌ అనిలో
అనలశ్చ యౌ భూమి ఆపః
హృదయం యమశ్చ
అహశ్చ రాత్రిశ్చ ఉభేచ
సంధ్యే ధర్మశ్చ జానాధి
నరశ్చ వృత్తిం " - వీరందరూ మన కర్మలకు సాక్షులు అని గరుడపురాణం తెలియచేస్తూంది.
ఆశ్చర్యం ఏమిటంటే ఈ సాక్షులు అందరూ మంచివారి పట్ల కొంచెం మెత్తగా ఉంటారుట. ఓ కార్యాలయంలో ఒకాయన తప్పు చేసాడు, సంస్థకి నష్టం వాటిల్లింది. వెంటనే శిక్ష వేసేయరు. అతని గతనడవడిక ఎటువంటిదో, ఆ తప్పు కావాలని చేసినదా అని ఆలోచించి గతనడవడిక మంచిదయితే చిన్న శిక్షతో ముగిస్తారు.
పరమాత్మ గీతలో " ఉపద్రష్టానుమంతా చ ....( భ.గీత 13:23 )" అని తెలియచేసారు. ఉపద్రష్ట అంటే దగ్గరగా ఉండి చూచువారు, సాక్షి. జీవుల శరీరంలోనే ఉండి ప్రతీ కర్మను గమనిస్తూ ఉంటారు.
అందుకే రోజూ అమ్మవారిని ధ్యానించడం, సూర్యుడు మొ.గు దేవతలకు నమస్కరించడం, ప్రకృతిని గౌరవించడం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ సాక్షులందరూ మరణం తరువాత శిక్ష పడే సమయంలో మన గురించి కొంచెం సానుకూలంగా చెబుతారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment