మనస్సు శుద్ధంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" విరజా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 779 వ నామం.

" విరజా " అంటే విగతములయిన పాపములు గలది. అంటే పాపములు లేనిది అని. మలినము లేనిది, శుద్ధమయినది అని కూడా అనుకోవచ్చు. 

పాపములు ఎందుకు కలుగుతాయి. కాని పనులు చేసినప్పుడు. అమ్మవారికి అటువంటి అవసరం ఏముంది. అధర్మపరులను అనుగ్రహించరు, ధర్మపరులను శిక్షించరు. వారి వారి కర్మలను బట్టి తగిన ఫలితాలు ఉంటాయి.

బ్రహ్మాండపురాణం " విరజక్షేత్రమందు బ్రహ్మదేవుడు విరజ అను దేవిని ప్రతిష్టించెను. ఆ అమ్మవారిని దర్శనము చేసిన మనుష్యుడు తన వంశములోని ఏడుతరాల వారిని పవిత్రము చేయుచున్నాడు " అని తెలియచేసింది. ఈ ఊరు ఒడిస్సాలో ఉంది. 

అమ్మవారు ఆబ్రహ్మకీటజనని. అన్ని జీవులకూ తల్లి. పిల్లలలో కావలసినవారు, అక్కర్లేనివారు అనే భావన ఎందుకుంటుంది 

తల్లికి. మంచిపనులు చేస్తే అవ్యాజకరుణామూర్తి, సంతోషిస్తుంది. చెడుపనులు చేస్తే కాళి, దండిస్తుంది. అయినా ఎవరు చేసిన కర్మలకు ఫలితం వారే అనుభవించాలి. వీరి కర్మలవలన అమ్మవారికి కలిసొచ్చేదీ లేదు, పోయేదీ లేదు.

అమ్మవారు పద్మంలా ఉంటారు. పద్మానికి బురద అంటదు, ఎప్పుడూ బురదలోనే ఉన్నా. అంత శుద్ధంగా ఉంటుంది పద్మం.

" అర్జునా , నీలో అసూయ అన్నది లేదు, అందుకనే ఈ ఉత్కృష్టమైన అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను ( భ.గీత 9:1 )" అన్నారు పరమాత్మ గీతలో. అంటే మలినం లేని మనస్సు అర్జునుడిది.

" తన్మే మనః శివ సంకల్పమస్తు ( సంకల్పసూక్తం ) - మా మనస్సులలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ " అని ప్రార్ధిస్తాం. అలా మంచి ఆలోచనలే కలుగుతే మనసు శుద్ధంగా ఉంటుంది. జీవితం సుఖమయం అవుతుంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన మనస్సులను కూడా ఎల్లప్పుడూ శుద్ధంగా ఉండేలా అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ