కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఉండాలి ప్రకృతికి, అమ్మవారికి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" కృతజ్ఞా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 374 వ నామం .
" కృతజ్ఞా " అంటే పుణ్యాపుణ్యములు రెండునూ తెలిసినది. కృతం అంటే చేయడం జ్ఞ అంటే తెలిసినది.
" కృతజ్ఞః " అని విష్ణుసహస్రంలో ఒక నామం. దానికి " ప్రాణులు చేసే కర్మలను చేయువాడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
మనం చేసే కర్మలన్నిటినీ అమ్మవారు గమనిస్తూ ఉంటారు. మంచిపనికి మంచిఫలితం, చెడుపనికి చెడుఫలితం మన ఖాతాలో కచ్చితంగా జమ చేస్తూ ఉంటారు.
అమ్మ చూడండి. పిల్లవాడు తప్పు చేస్తే దండిస్తుంది. మంచి మార్కులు వచ్చాయని చెబుతే మెచ్చుకుని బహుమతి ఇస్తుంది.
వాల్మీకి మహర్షి నారదులవారిని " ఈ 16 అద్భుత గుణములతో భూమిమీద నడయాడిన మానవుడు ఎవరయినా ఉన్నారా " అని అడిగితే నారదులు శ్రీరాముడి పేరు చెబుతారు. ఈ 16 అద్భుత గుణాలలో ఒకటి కృతజ్ఞత.
" చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు ఆదిశంకరులు. అంటే మనం చేసే కర్మలు చిత్తశుద్ధి కలిగేలా ఉండాలి అని. అలాగే " కృతఘ్నస్య నివృత్తయే " అని కూడా చెబుతారు. అంటే కృతఘ్నత పోయేలా కర్మలు చేయాలని. దీని అర్ధం అందరూ కృతజ్ఞత కలిగి ఉండాలని.
కృతజ్ఞత అని తరచూ వింటూంటాం. ఇతరులు చేసిన పని/సహాయం ని తెలుసుకోవడం/గుర్తుపెట్టుకోవడం, అలా సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేయడం మన కర్తవ్యం.
ముక్తి పొందడానికి అవసరమయిన ఉపాధి/శరీరం ని ఇచ్చిన దేవతలను, పితృదేవతలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను నిత్యం స్మరిస్తూ కృతజ్ఞతతో మెలగాలి. సహాయం చేసినవారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి.
దేవ, పితృ, గురు ఋణాలు ఉంచుకోకూడదు అంటారు. ఈ ఋణం తీర్చుకోవడమే కృతజ్ఞత. ఆవు మొ.గు జీవులు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిపట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం సుఖంగా ఉండాలంటే సమాజం కూడా సహకరించాలి. అందుకే సమాజం పట్ల కూడా కృతజ్ఞతగా ఉండాలి.
అన్నీ మనకు ప్రకృతే ఇస్తుంది. అందుకని ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి. చెట్లునాటడం, నీటిని వృధాచేయకపోవడం, ఇంధనాలను జాగ్రత్తగా, వాతావరణంని పాడుచేయకుండా వాడడం చేయాలి.
మన సనాతనధర్మం చెప్పేదంతా ప్రకృతి ఆరాధనే. " వృక్షో రక్షతి రక్షితః " - చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అంది మన సంస్కృతి. చెట్లకు కూడా జీవం, స్పందన ఉంటాయని మొదటి తెలియచేసింది మన ధర్మమే. అందుకే మనం చెట్లను పూజిస్తాం. జంతువుల, పక్షుల ఉనికి, సమతుల్యత ఎంతో అత్యవసరమని తెలియచేస్తున్నారు నేటి శాస్త్రజ్ఞులు. అది మన ఋషులు వేల సంవత్సరముల క్రితమే తెలియచేసారు.
పక్షులకోసం ఇంటి ముందర వరి కంకులను వ్రేలాడదీసేవారంటేనే తెలుస్తుంది ప్రకృతి పట్ల మన ఋషులు, పూర్వీకులు ఎంత గౌరవంగా, ప్రేమగా, కృతజ్ఞతగా ఉండేవారో అన్న విషయం.
మన సనాతనధర్మంకి సాటిలేదు, రాదు. ప్రపంచ మనుగడకు మన సనాతనధర్మమే దిక్కు. వేరే దారి లేదు. ఆ విషయం ఎంత తొందరగా ఇతరులు గ్రహిస్తే అంత మంచిది.
అమ్మవారు మనపట్ల చూపే కృపకు సదా కృతజ్ఞతగా మసులుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment