అమ్మవారు బహు సుకుమారం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" కోమలాకారా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 437 వ నామం.
" కోమలాకారా " అంటే సుకుమారమగు ఆకారము గలది అని భాష్యం చెప్పారు. అమ్మవారు సుకుమారి. అమ్మవారి ముఖము, కాళ్ళు, కనులు అన్నీ పద్మంలా మృదువుగా, సుకుమారంగా ఉంటాయి.
శ్రీసూక్తంలో అమ్మవారిని " సరసిజనిలయే సరోజహస్తే ధవలతమాంశుక గంధమాల్య శోభే " అని ప్రార్థిస్తాం.
" తామరపువ్వుపై కూర్చొని, చేతిలో తామరపువ్వును పట్టుకొని, శుభ్రమైన వస్త్రాలు ధరించి, గంధపు మాల ధరించిన ఓ దేవీ నీకు నమస్కారం " అని. తామరపువ్వు ఎంత మృదువుగా, సుకుమారంగా ఉంటుందో మనకు తెలుసు. అటువంటి పువ్వుమీద కూర్చుని ఉండే అమ్మవారు ఇంకెంత సుకుమారంగా ఉంటారో ఊహించుకోవచ్చు.
ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:
" కిరీటం వైరించం పరిహర
పురః కైటభ భిదః,
కఠోరే కోటీరే స్ఖలసి జహి
జమ్బారి మకుటం,
ప్రణమ్రే ష్వేతేషు ప్రసభ
ముపయాతస్య భవనం,
భవ స్యాభ్యుత్థానే తవ
పరిజనోక్తిర్వి జయతే " - 29
" అమ్మా ! నీ ముందు భాగమున ఉన్న బ్రహ్మ యొక్క కిరీటమును తప్పుకొని, కైటభుడు అను రాక్షసుని వధించినట్టి రత్నములు పొదిగి కఠినముగా ఉన్న విష్ణుమూర్తి కిరీటము కొసను తాకి జారెదవు ఏమో, జంభుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కిరీటమును తప్పుకొని, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగువారు నమస్కరించుచుండగా, నీ మందిరమునకు వచ్చుచున్న పరమశివుని కొఱకు నీవు వడివడిగా వెళ్ళు సమయమున నీ పరిచారికలు ఈ విధముగా పలుకుట సమంజసమే కదా " అని.
అమ్మవారు సింహాసనంమీద కూర్చుని ఉంటే కిరీటాలు ధరించిన బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు శిరస్సులు వంచి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నారుట. ఆ సమయంలో పరమేశ్వరుడు రావడంతో ఆయనను ఆహ్వానించడానికని అమ్మవారు చటుక్కున లేచి ఎదరకు వెళ్ళబోతూంటే పరిచారికలు " అమ్మా కొంచెం చూసుకుని మెల్లిగా వెళ్ళండి. మీకు నమస్కరిస్తూన్న బ్రహ్మాది దేవతల కిరీటాలు తగిలి మీ పాదాలకు గాయాలు అవుతాయి " అని జాగ్రత్తలు చెబుతున్నారుట.
అంత సుకుమారం అమ్మవారు.
సుకుమారమైన అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment