నీతి శాస్త్రం ఉంటుంది కాని అవినీతిశాస్త్రం ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శాస్త్రమయీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 705వ నామం.
" శాస్త్రమయీ " అంటే శాస్త్రమే ( వేదమే ) ప్రధానముగా గలది. శాస్త్రం అంతా శాస్త్రీయం. దేశ రాజ్యాంగం లాంటిది. అమ్మవారి అనుగ్రహమయినా దండన అయినా శాస్త్రప్రకారమే. శాస్త్రం ఏది చెబుతే అది చేయడాన్ని శ్రద్ధ అంటారు. అలా చేయని వారిని మూఢులు అంటారు.
శాస్త్రోక్తం అనేమాట తరచూ వింటూంటాం. దాని అర్థం శాస్త్రాలు చెప్పినట్లు నడుచుకోవడం.
శాస్త్రాలు ఎప్పుడూ మంచిని, సమాజానికి ఉపయోగపడే విషయాలనే చెబుతాయి. నీతిశాస్త్రం ఉంటుంది కాని అవినీతిశాస్త్రం ఉండదు.
శాస్త్రాలు నిక్కచ్చిగా ఉంటాయి. అవి మేలు కలిగిస్తాయి. తాత్కాలికంగా సుఖాన్ని ఇవ్వకపోవచ్చు కాని అంతిమంగా శాశ్వత ఆనందాన్ని కలుగచేస్తాయి.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు అర్జునుడికి:
" తస్మాత్ శాస్త్రం ప్రమాణం
తే కార్యాకార్య వ్యవస్థితౌ,
జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం
కర్మ కర్తుమిహార్హసి "
- భ.గీత 16:24
పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని.
ఎంత అద్భుతం. పరమాత్మ తను చెప్పింది చెయ్యమనలేదు. శాస్త్రాలు ఏది చెబుతున్నాయో అది చెయ్యి అన్నారు.
రాముడు కూడా ఇలా చేద్దాం అనేవారు కాదు. శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి కనుక ఇలా చేద్దాం అనేవారు.
రాముడిని ఎలాగయినా ఒప్పించి అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికని అరణ్యానికి వచ్చిన భరతుడిని " వేదశాస్త్రాల ప్రమాణం లేకుండా కేవలం వాదనకోసమనే మాట్లాడే వారిని దూరం పెడుతున్నావు కదా " అని అడుగుతారు రాముడు.
శాస్త్రం అంత ఉత్కృష్టం. శాస్త్రం అమ్మవారి స్వరూపం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment