మనం చదివే చదువులన్నీ అవిద్యలే, అసలు చదువులే కావు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పరాపరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 790 వ నామం.

" పరాపరా " అంటే పరా, అపరా అనే భేద భావం లేనివారు అని. పరాపరా స్వరూపురాలు.

పర, అపర కి చాలా అర్ధాలు చెప్పారు. పర అంటే పరులు కనుక అపర అంటే కావలసినవారు. అమ్మవారికి కావలసినవారు, అక్కర్లేనివారు అనే భేదం ఎందుకు ఉంటుంది. అందరూ అమ్మవారికి కావలిసినవారే. వారి వారి కర్మలను బట్టి ఫలాలు ఉంటాయి.

పరా అంటే పరబ్రహ్మము, అపరా అంటే పరా కానిది, ప్రపంచ/ప్రకృతి పరమయినది. 

చక్కటి ఉదాహరణ - ఆకాశంలోని సూర్యుడు పరబ్రహ్మ. కుండలోని నీటిలో కనబడే సూర్యుడు అపరబ్రహ్మ.

ఈ విషయమై బృహదారణ్యకోపనిషత్తులో ఓ చక్కటి వృత్తాంతం ఉంది:

నారదులు సనత్కుమారుడితో " స్వామీ వేదవేదాంగాలు శాస్త్రాలు చదివాను, సంగీతం వంటి ఎన్నో కళలు సాధన చేసాను. కాని మనశ్శాంతి లేదు. ఆత్మజ్ఞానం కలుగలేదు. నాకు ఆత్మజ్ఞానం తెలియచేయండి " అని అడుగుతారు.‌ ఆయన అన్నారు " ఈ వేదాలు, శాస్త్రాలు, కళలు అన్నీ అపరావిద్యలు. ఇవన్నీ కర్మలను తెలియచేస్తాయి. అవి భౌతికసుఖాలను ఇస్తాయి కాని శాశ్వతమయిన ఆత్మజ్ఞానం కలిగించవు. దానికి పరావిద్యను ఆశ్రయించాలి " అని.

కఠోపనిషత్తు కూడా ఇదే తెలియచేసింది:

" నాయమాత్మా ప్రవచనేన లభ్యో

  న మేధయా న బహూనా శ్రుతేన "

            - కఠోపనిషత్తు 1.2.23

" వేదాధ్యయనం వలన గాని, వేదాంత గ్రంథ పఠనం వలన గాని ఆత్మ లభించదు.  భక్తి, సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది " అని.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" త్రైగుణ్యవిషయా వేదా      

  నిస్త్రైగుణ్యో భవార్జున  !

  నిర్ద్వంద్వో  నిత్యసత్వస్థో  

  నిర్యోగక్షేమ ఆత్మవాన్ "

            - భ.గీత 2:45

" ఓ అర్జునా! వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు కూడా ప్రతిపాదించును. నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనల యందును ఆసక్తిని  త్యజింపుము‌ " అని.

కొందరికి కీర్తి, భోగాలు, స్వర్గలోకప్రాప్తి మీద ఆసక్తి ఉంటుంది. వారికి వాటికోసం చేయవలసిన యజ్ఞాలు, కర్మలని వేదాలు, పురాణాలు తెలియచేస్తాయి. కాని ముక్తినివ్వవు. దానికి పరావిద్యని ఆశ్రయించవలసినదే. అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే చేయవలసినది.

నేటితో శ్రీలలితాదేవీ నవరాత్రుల ఆఖరిరోజు. ఈరోజు పవిత్రమయిన శ్రీరామనవమి. శుభాకాంక్షలు . 

అమ్మవారిని, జగదానందకారకుడిని అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ