తెల్లని ముత్యాలు ఎరుపుగానూ నీలంగానూ కనిపించాయిట - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" జానక్యాః కమలామలాంజలి
పుటే యాః పద్మరాగాయితాన్యస్తా
రాఘవమస్తకే తు విలసత్కుంద
ప్రసూనాయితాః స్రస్తాః
శ్యామలకాయకాంతికలితాః
యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవంతు
భవతాం శ్రీరామవైవాహికాః"
ఈ శ్లోకం ఇంచుమించు ప్రతీ పెళ్ళి శుభలేఖలోనూ కనిపిస్తూంటుంది. కొన్ని వేలసార్లు చూడడం, చదవడం చేసి ఉంటాం అందరం.
ఈ శ్లోకం శ్రీ శంకరాచార్య విరచిత " రామకర్ణామృతం " లోనిది.
" రాముడు సీతమ్మ తలపై, సీతమ్మ రాముడి తలపై పోసిన తలంబ్రాలు సర్వజగత్తుకు మంగళములు కలిగించుగాక " అని తాత్పర్యము.
తలంబ్రాలకు బియ్యమే ఎందుకు వాడాలి. " ప్రాలు " అంటే బియ్యం. తలంబ్రాలు పేరులోనే బియ్యం ఉన్నాయి.
దోసిలి హృదయం, బియ్యం చంద్రుడు/మనస్సు. దోసిళ్ళలో బియ్యం తీసుకుని మంత్రించి వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పోసుకుంటే వారి హృదయాలు మనస్సులు ఒకటి అవుతాయి అని భావం.
అదీ సనాతనధర్మం విశిష్టత. ప్రతీ సంప్రదాయానికి ఓ శాస్త్రీయ కారణం తెలియచేస్తుంది.
ఇక్కడ ఓ అద్భుత ఘట్టం ఉంది. ముత్యాలు వాడారు తలంబ్రాలకు. తెల్లటి ముత్యాలు సీతమ్మ దోసిలలో ఉన్నప్పుడు ఆమె చెయ్యి ఎర్రగా ఉండండంతో ఎర్రగా కనబడుతున్నాయిట. రాముడి తలపై పోసినప్పుడు ఆయన ముఖంమీదుగా క్రిందకు జారుతూన్నప్పుడు నీలంగా ఉన్నాయిట. శ్రీరాముడిది నీలవర్ణం కనుక. అవే ముత్యాలు తెలుపు, ఎరుపు, నీలంగా కనిపించాయిట అని. ఎంతటి అద్భుత భావన.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment