రక్తం పంచుకుని పుట్దిన సోదరులు మాత్రం మళ్ళీ దొరకరు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" దేశే దేశే కళత్రాణి
దేశే దేశే చ బాంధవాః,
తంతు దేశం న పశ్యామి
యత్ర భ్రాతా సహోదరః "
రామాయణంలో శ్రీరాముడు ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రానికి లక్ష్మణుడు చనిపోయాడనుకుని అంటారు " ఇంకో భార్య దొరుకుతుంది, ఇంకో బంధువు ( స్నేహితుడు కూడా ) దొరుకుతాడు కాని ఇంకో తోబుట్టువు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకడు/దు " అని. ఎంత అద్భుతం రామాయణ మహాకావ్యం. అందుకే అది ఇతిహాసం అయింది.
అనారోగ్యం వలనో వేరే దుర్ఘటనలోనో భార్య చనిపోతే ధర్మకార్యనిర్వహణకోసం ఇంకో వివాహం చేసుకోవలసి రావచ్చు. అంటే ఇంకో భార్య అవసరమయితే దొరుకుతుంది.
ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ రాముడు/వాల్మీకిమహర్షి " భార్య " ప్రస్తావన ఎందుకు తెచ్చారు, వేరే ఏదయినా చేర్చవచ్చు కదా అని. ఇందులో " ధర్మం " దాగి ఉంది. భార్య అంటే ధర్మపత్ని. ఏ పూజ/క్రతువు చేయాలన్నా భార్య ఉండాలి - ధర్మపత్ని సమేతః అంటారు. ఋగ్వేదం " యా దంపతీ సమనసా కురుతః - దంపతులు ఏకమనస్కులై యజ్ఞాలు చేస్తున్నారు " అంది. అధర్వణవేదం " ఇమం యజ్ఞం సహపత్యా " అని తెలియచేస్తూంది. దురదృష్టవశాత్తు భార్యను కోల్పోతే ధర్మకార్యనిర్వహణకోసం ఇంకో భార్యను పొందాలి/పొందవచ్చు.
అబ్బాయికో అమ్మాయికో బయటి సంబంధం చూసి వివాహం చేస్తే కొత్త బంధువులు వస్తారు/దొరుకుతారు. ఉన్న ఊరునుంచి ఇంకో ఊరుకి బదిలీమీద వెడితే అక్కడ కొత్త స్నేహితులు దొరుకుతారు.
మరి కొత్త తోబుట్టువులను ఇదే రీతిన సంపాదించగలరా ఎవరయినా. ఏమాత్రం వీలుపడదు.
అందుకే " తోబుట్టువులతో ప్రేమతో సఖ్యతతో మెలగండి. ఆస్తులకోసమో చిన్న చిన్న మనస్పర్ధలతోనో తోబుట్టువులను మాత్రం దూరంచేసుకోకండి. ఇంకో తోబుట్టువును సంపాదించడం అసాధ్యం " అని చెబుతూంది రామాయణం.
అందుకే రామాయణాన్ని చిన్నతనం నుంచే పిల్లలచేత చదివిస్తే వారు బాధ్యతగల పౌరులుగా తయారవుతారు. దేశం అన్నిరంగాలలోనూ సులువుగా పురోగమిస్తుంది.
ఎంత అద్భుతం మన సనాతనధర్మం. దానికి సాటి లేదు, ఇకపై రాదు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment