శరణాగతి అంటే చాలు, పరమాత్మ ఆదుకుంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అందాల రాముడు
ఎందువలన దేముడు "
" సకృదేవ ప్రపన్నాయ
తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో
దదామి ఏతత్ వ్రతం మమ"
" ప్రపన్నాయ " అంటే శరణాగతి. " తవాస్మీతి " అంటే నీవాడను.
విభీషణుడు రావణుడిని విడిచిపెట్టి రాముడి చెంతకు రాగానే " రా నాయనా " అనలేదు రాముడు. వానరవీరులందరినీ సంప్రదించారు ఏమి చేద్దాం అని. సుగ్రీవుడితో సహా అందరూ " అతను శతృవు తమ్ముడు, యుద్ధానికి ముందు వచ్చాడు, మోసమేదయినా ఉండవచ్చు. దరిచేరనీయడం మంచిదికాదు. వద్దు " అన్నారు.
అప్పుడు హనుమను కూడా అడుగుతారు రాముడు. " ఈ విభీషణుడిని నేను ఇదివరకే రావణసభలో చూసాను. ఇతని మాటలను కూడా విన్నాను. ఇతని ముఖంలో కాని మాటలలో కాని నాకు కపటం ఏమీ కనబడలేదు. ఒకవేళ కపటంతోనే వచ్చి ఉన్నా మనమేమీ చాతకాని వారం కాదు కదా " అంటారు హనుమ.
అప్పుడు రాముడు పై శ్లోకం ద్వారా తన అభిప్రాయాన్ని చెబుతారు. శరణాగతి అంటూ నేను నీవాడను అని నన్ను కోరినవారిని అక్కున చేర్చుకోవడం నా ఏకైక వ్రతం " అని చెబుతారు రాముడు. విభీషణుడే కాదు, రావణుడు వచ్చి శరణాగతి అన్నా అక్కున చేర్చుకుంటాను అన్నారు రాముడు. అవ్యాజకరుణామూర్తి.
గరుత్మంతుడు రాముడిని " రిపుణామతి వత్సలా " - అంటే శతృవుని కూడా ప్రేమతో ఆదరించేవారు అన్నాడు.
ఇది కేవలం విభీషణుడి విషయం కాదు. మన అందరికీ రాముడు ఇచ్చిన సందేశం. " నువ్వే దిక్కు " అంటే చాలు, మన యోగక్షేమాలన్నీ రాముడు చూసుకుంటారు.
ఇదే పరమాత్మ గీతలో చెప్పినది:
" అనన్యాశ్చింతయంతో మాం
ఏ జనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహం "
- భ.గీత 9:22
" తక్కువేమి మనకు రాముడొక్కడు ప్రక్కనుండువరకు " అన్నారు భక్తరామదాసు.
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.
" అందాల రాముడు
అందువలన దేముడు "
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment