త్యాగయ్య జయంతి ( 04/05/1767 ) నేడు. శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

త్యాగరాజ కృతి 

 - రాగం:కళ్యాణి, తాళం:ఆది 

పల్లవి:

శివే పాహి మాం అంబికే శ్రిత ఫల దాయకి

అనుపల్లవి:

కావేరిజోత్తర తీరవాసిని

కాత్యాయని ధర్మసంవర్ధని (శివే)

చరణములు:

1.స్వభావమౌ నీ ప్రభావము

   మహానుభావురాలైన 

   భారతికి పొగడ

   భారమైయుండ  

   భావజారాతి భామ   

   నేనెంత? భాగ్య దాయకి    

   ‌                (శివే)

2.కలార్థమిది శశి కలాధరి  

   యుప- వలారి మాయా  

   విలాసిని సకలాగమనుతే  

‌   బలారియన శుభ

   ఫలాలొసగు పరమ   

   లాలనమ్మున (శివే)

3.చరాచర మయి  

   కరారవిందమున

   రామ చిలుకను బిరాన   

   బూని పరాకు జూడరాదు 

   శ్రీరఘు-వరాప్తుడగు  

   త్యాగరాజ వినుతే (శివే)

త్యాగయ్య అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కీర్తన ఇది. మొదటి చరణంలో " నిన్ను పొగడడం భారతి/సరస్వతికే భారము/కష్టము అయిపోయింది, ఇక నేనెంత " అన్నారు.

ఈ విషయం శంకరాచార్య విరచిత సౌందర్యలహరిలోని ఓ అద్భుత శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది.

" కలాలాపా " అమ్మవారి అద్భుత నామం. ఈ నామానికి అర్ధం " మధురమయిన భాషణములు చేయునది " అని. అంటే అమ్మవారి మాటలు అతిమధురంగా ఉంటాయని.

శంకరాచార్య విరచితమైన సౌందర్యలహరి లో ఓ అద్భుతమైన శ్లోకం :

" విపంచ్యా గాయంతీ 

  వివిధ మపదానం పశుపతేః, 

  త్వయారబ్దే వక్తుం చలిత శిరసా సాధువచనే,

  తదీయై ర్మాధుర్యై రవలపిత 

  తంత్రీ కలరవాం , నిజాంవీణాం వాణీ  

  నిచుళయతి చోళేన నిభృతం " - 66

మణిద్వీపం లో సింహాసనం మీద అమ్మవారు కూర్చుని ఉన్నారు. దేవతలందరూ కొలువుదీరి ఉన్నారు. చదువుల తల్లి సరస్వతి ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ అద్భుతంగా వీణావాదన చేస్తూంది - అమ్మవారు బుద్ధిపూర్వకంగానో అప్రయత్నంగానో " ఆహా ఓహో బాగుంది " అంటున్నారుట. ఆవిడ మాటలు ఎంత మధురాతి మధురం గా ఉన్నాయంటే శ్రీవాణి తన వీణావాదాన్ని ఆపేసి వీణ మీద తన చీర కొంగు కప్పేసిందిట.

దేవతలు ఎవరూ తన వీణావాదనం వినటం లేదని , అమ్మవారి మధురమైన పలుకులనే వింటున్నారని భారతీదేవి వీణావాదన ఆపేసి అలా చేసిందని భావం. 

చదువులతల్లి భారతి వీణావాదన కంటే అమ్మవారి పలుకులే మధురంగా ఉన్నాయి వింటూన్న దేవతలకు అన్నారు శంకరులు.

త్యాగయ్య దీనినే చమత్కారంగా " అమ్మా సరస్వతీదేవే నిన్ను మెప్పించలేకపోయింది, ఇంక నేనెంత " అంటారు. ఎంత చక్కటి విషయం ఇమిడి ఉంది ఈ కీర్తనలో.

ఈరోజు త్యాగయ్య జయంతి ( 04/05/1767 ). శుభాకాంక్షలు అందరికీ.

ఈరోజు పుష్యమి నక్షత్రంతో కూడిన భానుసప్తమి, అలభ్యయోగం. ధ్యానం, జపంకి ఉత్తమం - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ