శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
ఈ రోజు జగద్గురువులు శ్రీశంకరాచార్యుల జయంతి.
శంకరులు సనాతనధర్మ పరిరక్షకులే కాదు, హిందూజాతి రక్షకులు. గొప్ప దార్శనికులు. ఆయన సమయంలో కర్మకాండ ఉచ్ఛస్థితిలో ఉంది. కర్మకాండ శ్రద్ధగా చేయవలసినది, శ్రమతోనూ ఖర్చుతోనూ కూడుకున్నది. యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసేవారే కాదు, చేయించేవారు కూడా ఉపవాసాలు, మడి వంటి కఠిన నియమాలు పాటించాలి. లేకపోతే లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది.
కర్మకాండ రోగానికి చికిత్స లాంటిది. మధుమేహం రోగికి కొన్ని నియమాలు ఉంటాయి. మాత్ర వేసుకున్న పదిహేను నిమిషాల లోపున భోజనం చేయమని చెబుతారు వైద్యులు. మాత్ర వేసుకుని పనిలో పడో, మర్చిపోయో గంట దాకా భోజనం చేయకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. నియమపాలన తప్పనిసరి.
జ్ఞానకాండ అటువంటిది కాదు. విష్ణుసహస్రనామాలో, అష్టకాలో, శ్లోకాలో చదవడానికి, ఏదయినా నామజపం చేసుకోవడానికి అయితే కాళ్ళు చేతులు కడుగుకోవడం, శుభ్రమయిన బట్ట కట్టుకోవడం చేస్తే చాలు. శ్రద్ధ కొంచెం తక్కువ అయినా లాభం ఉండదేమో కాని నష్టం ఉండదు. అందుకని జ్ఞానకాండ గొప్పది అని సమాజానికి తెలియచేయడానికి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా దేశమంతా కాలినడకన తిరిగి శ్రమపడ్డారు. ఒడిదుడుకులతో కూడిన నేటి హడావిడి జీవితలో ప్రజలందరూ యజ్ఞాలు యాగాలు చేయలేక, చేయించేవారు లేక భ్రష్టు పడిపోయి ఉండేవారు. ఎక్కువ శ్రమ పడకుండా ఇప్పుడు సహస్రనామ పారాయణలు, భజనలు, శ్రీరామనవమి, వినాయకచవితి వేడుకలు లాంటివి చేసుకుంటూ తరిస్తున్నారు. అందుకే వెయ్యి ఏళ్ల పైబడి ముష్కరుల పాలనలో నానా బాధలు పడినా హిందూజాతి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తూంది.
శివానందలహరి గానం చేస్తూ శంకరులు ఇలా ప్రార్ధన చేసారు:
" స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితగానఫణితౌ,
పురాణే మంత్రే వా స్తుతి నటనహాస్యే ష్వచతురః,
కధం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికో2హం పశుపతే,
పశుం మాం సర్వజ్ఞ ప్రధితకృపయా పాలయ విభో "
" ఓదేవా ధర్మశాస్త్రము నందుగాని, తర్క వ్యాకరణాదులయందు గాని, వైద్యము శకునం కవిత్వం సంగీతం పురాణం మంత్రశాస్త్రములందు గాని, స్తోత్రం నాట్యం హాస్యములందుగాని, నాకు పాండిత్యం లేదు. ఇలాంటి నా మీద ప్రభువులకు ప్రేమ ఎట్లు జనించును?. జనింపదు. కాబట్టి ఓదేవా అజ్ఞానుడనైన నన్ను కాపాడుము " అని.
" బ్రహ్మ సత్యం జగన్మిధ్య,
జీవో బ్రహ్మ ఏవ నాపరః "
అంటే జీవుడు ( మనం ) బ్రహ్మ ఒకరే, తేడాలేదు అని తెలియచేసారు. ఎంత అద్భుతవిషయం.
" ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ,
సర్వం ఇదం ఈశావాస్యం " -
బ్రహ్మ ఒక్కరే, అంతటా ఈశ్వరచైతన్యమే అని లోకానికి తెలియచేసారు.
అంతటి మహానుభావుడు, సనాతనధర్మ రక్షకుడు, బ్రహ్మసూత్రాలకు, విష్ణుసహస్రనామాలకి భాష్యం వ్రాసినాయన, దేశరక్షణకోసం నాలుగు దిక్కులా 4 పీఠాలు ఏర్పాటుచేసినాయన, 32 సం.లకే 3 సార్లు దేశమంతా కాలినడకన పర్యటించినాయన, మనల్ని తరింపచేయడానికి ఎన్నో స్తోత్రాలు అష్టకాలు ప్రసాదించినాయన తనను తాను ఎంతో అజ్ఞానిని/అమాయకుడిని అని విన్నవించుకుంటున్నారంటే ఎంతటి ఆశ్చర్యకరం. " ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి " అనే సూక్తి వీరినుంచే వచ్చిందేమో. కారణజన్ములు.
అందరికీ " శ్రీశంకరజయంతి " శుభాకాంక్షలు.
సర్వే జనాః సుఖినో భవంతు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment