శ్రీనృసింహస్వామి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

శ్రీనృసింహస్వామి జయంతి నేడు.

హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నృసింహస్వామి ఓ ఎత్తైన సింహాసనంమీద కూర్చుంటారు. గోళ్ళనుంచి రక్తపు బొట్లు కారుతూ చాలా ఉగ్రంగా ఉంటారు. బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు చివరకు లక్ష్మీదేవి కూడా స్వామి దగ్గరకు వెళ్ళడానికి సంకోచించి ప్రహ్లాదుడిని పంపిస్తారు. 

స్వామి ప్రహ్లాదుడిని రెండు చేతులతో ప్రేమగా పైకి ఎత్తి తన తొడమీద కూర్చోపెట్టుకుని బ్రహ్మాది దేవతలు భయపడుతున్నారు నా దగ్గరకు రావడానికి, నీకు భయంగా లేదా అని అడుగుతారు. స్వామి " మీరు నా రక్షకులు, నన్ను తరింపచేయడానికి వచ్చారు. నాకు భయమెందుకు కలుగుతుంది " అంటాడు ప్రహ్లాదుడు. " నీకు ఇష్టమయిన ఓ చక్కని కోరిక కోరుకో " అంటారు స్వామి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు " స్వామి కోరిక కోరుకోమన్నారేమిటి. నాలో ఇంకా తీరని కోరిక ఏమయినా మిగిలిపోయిందా " అని. 

" మా మాం ప్రలోభయా - నన్ను ప్రలోభపెట్టకు స్వామి " అన్నాడు ప్రహ్లాదుడు. కోరిక అంటే శరీరమమకారం కలుగుతుంది. ఊబిలోకి లాగేస్తుంది. ఓ కోరిక అంటూ మొదలవుతే అది అక్కడితో ఆగదు కదా. 

స్వామి అంటారు " అందరి కోరికలు తీర్చేవాడిని నేను. నన్ను చూడగానే భక్తులు కోరికలు కోరుకుంటారు. నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాను, నీ పట్ల ప్రీతుడయి ఉన్నాను, ఏదయినా కోరిక కోరుకో " అని. 

అప్పుడు ప్రహ్లాదుడు " స్వామీ మీకో విషయం చెప్పవచ్చా " అని అడిగి ఇలా అంటాడు:

" ఇంద్రియాణి మనః ప్రాణ 

  ఆత్మ ధర్మో ధృతిః

  హ్రీః శ్రీస్తేజః స్మృతిః సత్యం 

  యస్య నశ్యన్తి జన్మనా "

        - భాగవతం 7:10:8

" ఓ ప్రభూ, ఒక వ్యక్తికి పుట్టుక ప్రారంభం నుండే ఉన్న కామ కోరికల కారణంగా, అతని ఇంద్రియాలు, మనస్సు, జీవితం, శరీరం, మతం, ఓర్పు, తెలివి, సిగ్గు, ఐశ్వర్యం, బలం, జ్ఞాపకశక్తి మరియు సత్యసంధత అన్నీ నశించిపోతాయి " అని.

స్వామి మళ్ళీ కోరిక కోరుకో పర్వాలేదు అనడంతో ఇక తప్పదని భావించి ప్రహ్లాదుడు " మిమ్మల్ని ఎప్పుడూ ఏ కోరికా కోరకుండా ఉండేలానూ, నా మనస్సులో ఏ కోరికా కలగకుండా ఉండేలానూ వరమివ్వండి " అని కోరుకున్నాడు.

స్వామి ముగ్ధుడయి ప్రహ్లాదుడిని ఓ మన్వంతరంపాటు భూలోకానికి చక్రవర్తిని చేసారు. స్వామి అవ్యాజకరుణామూర్తి.

శ్రీనృసింహస్వామి జయంతి శుభాకాంక్షలు అందరికీ. స్వామిని అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీనృసింహస్వామ్యార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ