అమ్మవారు చూపులతో మోహాన్ని తొలగిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మృగాక్షీ " అమ్మవారి అద్భుత నామం 

ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 561 వ నామం.

" మృగాక్షీ " అంటే లేడి కన్నుల వంటి కన్నులు కలది అని భాష్యం చెప్పారు. మృగము అంటే లేడి, జంతువు అని కాదు.

మృగాక్షి, మృగనయని అని స్త్రీలను అంటూంటారు . లేడి కనులు పెద్దవిగాను, సొగసుగాను, చంచలంగానూ ఉంటాయి. ఎంతో అమాయకంగా, కరుణతో నిండి ఉంటాయి. అమ్మవారి కనులు కరుణతో నిండి ఉంటాయి. 84 లక్షల జీవరాశుల బాగోగులను చూడవలసిన కారణంగా ఇటూ అటూ కదులుతూ కొంచెం చంచలంగా కూడా ఉంటాయి. అందుకే అమ్మవారి కనులను లేడి కనులతో పోలుస్తారు.

మూక శంకరులు తన మూకపంచశతి లోని కటాక్షశతకంలో అమ్మవారి కళ్ళను అద్భుతంగా ఇలా వర్ణిస్తారు:

" ఆశ్చర్యమంబ మదాన

  అభ్యుదయావలంబః కామాక్షి 

  చంచలనిరీక్షణవిభ్రమస్తే 

  ధైర్యం విధూయ తనుతే 

  హృది రాగబంధం శంభోస్తదేవ 

  విపరీతతయా మునీనామ్ "     

                             - 61

" అమ్మవారి చంచలమైన చూపులు మన్మధుని అభివృద్ధికి ఆధారమయిన శివుని హృదయమున ధైర్యమును తొలగించి అనురాగమును కలిగించు చున్నను మునుల హృదయమునందు మాత్రము ధైర్యమును కలిగించి రాగమును తొలగించుచున్నది " అని.

ఈ శ్లోకంలో అద్భుతము ఆశ్చర్యకరము అయిన విషయం ఉంది. మన్మధుడిని శివుడు భస్మం చేసేస్తే అమ్మవారు తన చల్లని చూపులతో ప్రాణం పోసారు. అది మన్మధుడి అభివృద్ధికి కారణం అయింది. అమ్మవారి చూపులు శివుని ధైర్యం ( నిగ్రహం ) ని తొలగించి ( తనయందు ) రాగాన్ని ( కోరికను ) కలిగించారు. కాని అదే చూపుతో తన భక్తులయిన యోగులలో నిగ్రహాన్ని నింపి కోరికను తొలగిస్తారు. ఒకే చూపుతో విభిన్న ప్రక్రియలు చేసారు అని తెలియచేసారు. అమ్మవారు ఘటనాఘటన సమర్ధులు.

తన చల్లని చూపును మనమీద కూడా ప్రసరించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ