అమ్మవారు లేని వస్తువులలో కూడా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భావాభావవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 680 వ నామం.
" భావాభావవివర్జితా " అంటే భావరూపములగు ద్రవ్యాదులచేతను, అభావములచేతను విడువబడినది అని భాష్యం చెప్పారు. భావం అంటే ఉండేది, కనబడేది. అభావం అంటే ఉండనిది, కనబడనిది.
ఇంద్రియాలకు గోచరించేవి అన్నీ భావములు. కనబడనివి అభావములు. ఈ రెండు " స్థితులు " అమ్మవారికి లేవు.
ఈ అభావం ఒక అద్భుత విషయం.
కనబడేవాటికి స్థితి ఉంది అంటే అర్ధం తెలుస్తూంది. చెట్టు, నీరు, మట్టి, సూర్యుడు మొదలగునవి. కనబడని దానికి స్థితి ఏమిటి?
ఈ అభావాన్ని నాలుగు రూపాలలో తెలియచేసారు భాష్యకారులు:
1. ప్రాగాభావం - ప్రాక్ + అభావం - ఒక వస్తువు తయారుకాక పూర్వం ఆ వస్తువు ఉండని స్థితిని ప్రాగభావం అన్నారు. మట్టిముద్ద ఉంది. దానిని మట్టిముద్ద అంటాం. దానితో కుండని తయారు చేసాం. దానిని కుండ అంటాం. కుండ తయారుకాక పూర్వం కూడా మట్టిముద్దలో కుండ ఉంది. కాని కనబడదు. కుండ ఉండని స్థితి మట్టిముద్ద.
2. ప్రధ్వంసాభావం - ప్రధ్వంస + అభావం - ఒక వస్తువు పూర్తిగా ధ్వంసమయిపోయాక ఆ వస్తువు ఉండని స్థితి. కుండని, బ్రద్దలవుతే ముక్కల్ని కూడా కుండ అనే అంటాం. పూర్తిగా మట్టిముద్దగా అయితే మాత్రం కుండ అనం, మట్టిముద్ద అంటాం.
3. అనన్యాభావం - అనన్య + అభావం - ఒక వస్తువు ఇంకొక వస్తువుగా ఉండలేని స్థితి. నీరుని నీరు అంటాం. శీతలస్థితిలో మంచు అంటాం. రెండూ ఒకటే అయినా వేరు వేరే. నీరును మంచు అనం, మంచును నీరు అనం.
4. అత్యంతాభావం - అత్యంత + అభావం - ఉండడానికి అవకాశం లేనిదానిని ఈ అభావం అంటారు. గాడిదగ్రుడ్డు అని చాలా ఎక్కువగా సాధారణంగా అంటూంటాం మాటల్లో. ఉండడానికి అవకాశం లేనిది ఇది.
అమ్మవారు ఈ భావ, అభావ స్థితులు రెండూ లేనివారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment