అమ్మవారు భక్తసులభురాలు, శుభాలను ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శోభనాసులభాగతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 683 వ నామం.
" శోభనాసులభాగతిః " అంటే వైభవములు కలిగినది, సులభముగా చేరతగినది అని భాష్యం చెప్పారు. మోక్షాది పురుషార్ధాలను పొందడానికి అమ్మవారు భక్తసులభురాలు అని కూడా తెలియచేసారు. అమ్మవారి అనుగ్రహం పొందితే పునర్జన్మ ఉండదు.
మూకశంకరులు తన మూకపంచశతిలోని ఆర్యాశతకములో శ్రీకామాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తూ " చిరతరసుచరితసులభా " అంటారు. అంటే అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా సులువుట. కాని దానికి బహుకాలం మంచిగా/శ్రద్ధగా అమ్మవారిని సేవించుకోవాలి అని. ఆయన " బహుకాలం " అన్నారు.
మనం ప్రతిదినం పూజచేసేటప్పుడు సంకల్పంలో " మమ సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభాభ్యాం...." అని ప్రార్థిస్తాం. పరమేశ్వరుడి ఆనందంకోసం, ప్రీతికోసం, మన పాపాలు నశించడంకోసం ఈ పూజ అని. ఈ భక్తిని సాత్వికభక్తి అంటారు. ఇది సాధన చేయగా చేయగా నిర్గుణభక్తిగా మారుతుంది. ఆ స్థితిలో ఏ కోరికలు అంటే పాపాలు నశింపచేయి అనే అభ్యర్ధన కూడా ఉండదు. కేవలం పరమేశ్వరుడి ధ్యానమే.
దేవీభాగవతం తెలియచేస్తూన్నది ఏమిటంటే " నిర్గుణభక్తిలో పండిపోయిన జీవుడికి అమ్మవారు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకుంటారు. నిర్గుణభక్తిలోనే ఉంటూ సాధన పూర్తవక ముందే మరణిస్తే జీవుడిని అమ్మవారు మణిద్వీపానికి తీసుకుని వెడతారు. అక్కడ అమ్మవారి సమక్షంలో వైభవాలను అనుభవించి తదుపరి జన్మలో నిర్గుణభక్తి సాధన కొనసాగించి అమ్మవారిలో ఐక్యమవుతాడు జీవుడు " అని.
పరమాత్మ తను భక్తసులభుడినని గీతలో ఇలా తెలియచేసారు:
" అనన్యచేతాః సతతం
యో మాం స్మరతి నిత్యశః,
తస్యాహం సులభః పార్ధ
నిత్యయుక్తస్య యోగినః "
- భ.గీత 8:14
" పార్ధా, నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి , పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్పరాయణుడైనయోగికి నేను సులభుడను. అనగా అతనికి సహజముగనే నేను లభింతును " అని. అనన్యభావన అంటే నిర్గుణభక్తి.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి ముందర సాత్విక భక్తిని అనుగ్రహించమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment