రాగద్వేషాలు వదిలేస్తే సంసార బాధలు ఉండవు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భవారణ్యకుఠారికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 114 వ నామం.

" భవారణ్యకుఠారికా " అంటే సంసారమనెడి అడవికి గొడ్డలి వంటిది అని భాష్యం చెప్పారు. ఎంత పెద్ద అడవి అయినా ఓ చిన్న గొడ్డలి చాలు మొత్తం నరికేయడానికి. సంసారబంధాలవల్ల కలిగే బాధలు ఎంతటివి అయినా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే చాలు పటాపంచలవుతాయి. అది అంత సులభమా?. అమ్మవారి పాదాలపై చంచలమయిన మనసు నిలవద్దూ.

పరమాత్మ గీతలో దీనికి సులభమయిన మార్గం తెలియచేసారు:

" జ్ఞేయః స నిత్యసన్న్యాసీ         

  యో న ద్వేష్టి న కాంక్షతి,

  నిర్ద్వంద్వో హి మహాబాహో  

  సుఖం బంధాత్ ప్రముచ్యతే" 

                   - భ.గీత 5:3 

" మహాబాహూ, ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎఱుంగ వలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధములనుండి ముక్తుడగును " అని.

రాగద్వేషాలను అధిగమించమన్నారు పరమాత్మ. రాగం అంటే కోరిక. కోరికలు తప్పు కాదు. అవి ధర్మబద్ధంగా ఉండాలి. ద్వేషం వదిలేయమన్నారు. అసలు ద్వేషం ఎందుకు కలుగుతుంది. అసూయ వల్ల. తన కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడనో, ఎక్కువ సుఖపడుతున్నాడనో, ఎక్కువ సంపదలు కలిగి ఉన్నాడనో అని బాధపడడం. సుఖంగా ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి అలా ఇంకొకరితో పోల్చుకుని బాధపడవలసిన అవసరమే లేదు. అలా బాధపడడం వల్ల ప్రశాంతత లోపించి ఆరోగ్యం చెడుతుంది.

ఇలా ఉండడం కూడా అంత సులభం కాదు. కాని అమ్మవారి పాదాలను ఆశ్రయించి సాధన చేయగా చేయగా అటువంటి స్థితి కలుగుతుంది. జీవితం సుఖమయం అవుతుంది. సంసారబాధలు అనేవే ఉండవు.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ