అమ్మవారు బ్రహ్మానందంని అంటే జన్మరాహిత్యంని అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 851 వ నామం.
" జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ " అంటే పుట్టుక, చావు, ముసలితనం అనువానిచో తపించబడిన జనులకు పరమసుఖమును ఇచ్చునది అని భాష్యం చెప్పారు. విశ్రాంతి అంటే బాధలు తొలగిన తరువాత వెల్లడయే బ్రహ్మానందస్థితి అని తెలియచేసారు. మృత్యువు అంటే ఏమరుపాటు అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు. కొద్ది ఏమరుపాటు వల్ల కలిగే పర్యవసానం మరణం కన్నా బాధగా అనిపిస్తుంది. ఏదీ మన చేతుల్లో లేకున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తను అమ్మవారు కలుగచేస్తారు.
ఇవన్నీ లేకపోవడం అంటే జన్మరాహిత్యం, ముక్తి పొందడం. అదే కదా జీవుడు కోరుకునేది, కోరుకోవలసినది.
పరమాత్మ గీతలో ఇదే విషయాన్ని ఇలా తెలియచేసారు:
" గుణానేతానతీత్య త్రీన్
దేహీ దేహసముద్భవాన్,
జన్మమృత్యుజరాదుఃఖైః
విముక్తో2మృతమశ్నుతే '
- భ.గీత 14:20
" దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు ( సత్వ రజో తమో) గుణములను అధిగమించిన పురుషుడు జన్మ,మృత్యు జరా(వార్ధక్య), దుఃఖములనుండి విముక్తుడై,పరమానందమును పొందును " అని.
మానవులలోనే కాదు దేవతలలో కూడా ఈ మూడు గుణాలు ఉండి తీరుతాయి. కాని మనం వాటికి పూర్తిగా దాసులయిపోకుండా కొంచెం అప్రమత్తంగా అంటే అనవసర విషయాలకు స్పందించడం కొంచెం తగ్గించుకుంటే జీవితం ఆనందంగా సాగిపోతుంది.
సూర్యభగవానుడిని " కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః, జన్మమృత్యుజరావ్యాధిసంసారభయ నాశనః " అని ప్రార్థిస్తాం. కాలస్వరూపుడు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment