అమ్మవారి చిన్న అంశ జీవులన్నిటికీ చైతన్యాన్ని ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" చిత్కలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 728 వ నామం.

" చిత్కలా " అంటే అఖండ చైతన్యములో అంశ మాత్రమే గలది. ఎక్కడ?. సృష్టిలోని జీవులలో. అంతఃకరణ చైతన్య స్వరూపురాలు.

భారతీయ సంగీతంలో నాదోపాసన ఓ ముఖ్యమయిన సాధన. సంగీత కళాకారులకు భక్తులకు ఈ నాదోపాసన చక్కటి ఫలితాలను ఇస్తుంది. నాదోపాసన దశవిధానాలు. నిష్టతో సాధనలో ఉన్నప్పుడు కుండలినీ శక్తి మేల్కొని అనాహత చక్రం చైతన్యమంతమవుతే దశవిధనాదాలు అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రంలో స్థిరపడితే రకరకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే చిత్కళలు అంటారు. అమ్మవారు అలా చైతన్యంని అనుగ్రహిస్తారు సాధకులకు.

కళ అంటే శోభ/ప్రకాశం. చైతన్యం ఉంటేనే శరీరానికి శోభ. ఆ చైతన్యమే అమ్మవారు.

అమ్మవారి అంశ చిత్కళ. కళిక అంటే శిఖ/మొగ్గ. దీపశిఖ చిన్నదిగానే ఉంటుంది కాని ఇల్లంతా వెలుగు నింపుతుంది. అలాగే అమ్మవారి చిన్న అంశయే శరీరానికంతటకీ ప్రకాశాన్ని ఇస్తుంది.

ఇదే విషయాన్ని పరమాత్మ అర్జునుడికి తెలియచేసారు గీతలో:

" అథవా బహునైతేన 

  కిం జ్ఞాతేన తవార్జున ।

  విష్టభ్యాహమిదం కృత్స్నమ్ 

  ఏకాంశేన స్థితో జగత్ "

              - భ.గీత 10:42 

" ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇది మాత్రం తెలుసుకో చాలు, కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే, సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ/నిర్వహిస్తూ ఉన్నాను ".

చిన్న అంశ కలిగిన ఆచార్యులు, ఎగిరే పక్షులు, రకరకాల పువ్వులలోని చైతన్యం చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మనకు. 

ఏదయినా చిన్న పురుగును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సూది మొనంత ఉంటుంది. ప్రాకుతూ వెడుతూంటుంది. ముట్టుకో బోతే కొన్ని ఎగిరిపోతాయి కూడా. ఏమి తింటాయో తెలియదు.

84 లక్షల జీవరాశులు. మానవులే 600 కోట్లపైన. మరి జీవులు అన్నీ కలిసి ఎన్ని వేల/లక్షల కోట్లు ఉంటాయో. అన్నిటిలోనూ అమ్మవారి చైతన్యం ఉంటుంది.

కెన్నెత్ ఫోర్డ్ అనే భౌతికశాస్త్రజ్ఞుడు అన్నారు " ఎంత చిన్న పదార్ధాన్ని కనుక్కున్నా దానిలో చైతన్యం ( ఎనర్జీ ) ఉంటూంది ఆశ్చర్యకరంగా " అని.

ఇంక అమ్మవారి పూర్తి చైతన్యాన్ని చూసి తరించాలంటే ఎన్ని జన్మలు కఠిన సాధన చేయాలి. 

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అనుగ్రహించి చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ