అమ్మవారు భక్తులకు నిధి వంటివారు, ఆన్ని కోరికలు తీరుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భక్తనిధిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 567 వ నామం.
" భక్తనిధిః " అంటే భక్తుల కోరికలను తీర్చు గని వంటిది అని భాష్యం చెప్పారు.
అమ్మవారు భక్తుల కోరికలన్నీ తీరుస్తారు. ఎప్పుడు?. కోరిక ధర్మబద్ధమయినప్పుడు.
కోరిక తప్పు కాదు. సాధారణంగా దేవతలకు సత్వగుణం, మనుషులకు రజోగుణం, జంతువులకు తమోగుణం పాలు అధికంగా ఉంటాయి. మన సౌకర్యాలకోసమో, ఆనందం కోసమో కోరికలు కోరుకుంటూంటాం. దీనిని రజోభక్తి అంటారు. ఎవరయినా తమోగుణం పాలు ఎక్కువయి మరీ వికృతంగా ప్రవర్తిస్తే " మనిషివా పశువ్వా " అంటూంటాం అందుకే.
హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరసింహస్వామి ఓ ఎత్తైన సింహాసనంమీద కూర్చుంటారు. గోళ్ళనుంచి రక్తపు బొట్లు కారుతూ చాలా ఉగ్రంగా ఉంటారు. బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు చివరకు లక్ష్మీదేవి కూడా స్వామి దగ్గరకు వెళ్ళడానికి సంకోచించి ప్రహ్లాదుడిని పంపిస్తారు.
స్వామి ప్రహ్లాదుడిని రెండు చేతులతో ప్రేమగా పైకి ఎత్తి తన తొడమీద కూర్చోపెట్టుకుని " నీకు ఇష్టమయిన ఓ చక్కని కోరిక కోరుకో " అంటారు. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు " స్వామి కోరిక కోరుకోమన్నారేమిటి. నాలో ఇంకా తీరని కోరిక ఏమయినా మిగిలిపోయిందా " అని. స్వామి " నన్ను చూడగానే భక్తులు కోరికలు కోరుకుంటారు. నువ్వు కూడా కోరుకో " అంటారు. అప్పుడు ప్రహ్లాదుడు " స్వామీ మీకో విషయం చెప్పవచ్చా " అని అడిగి ఇలా అంటాడు:
" ఇంద్రియాణి మనః ప్రాణ
ఆత్మ ధర్మో ధృతిః
హ్రీః శ్రీస్తేజః స్మృతిః సత్యం
యస్య నశ్యన్తి జన్మనా "
- భాగవతం 7:10:8
" ఓ ప్రభూ, ఒక వ్యక్తికి పుట్టుక ప్రారంభం నుండే ఉన్న కామ కోరికల కారణంగా, అతని ఇంద్రియాలు, మనస్సు, జీవితం, శరీరం, మతం, ఓర్పు, తెలివి, సిగ్గు, ఐశ్వర్యం, బలం, జ్ఞాపకశక్తి మరియు సత్యసంధత అన్నీ నశించిపోతాయి " అని.
స్వామి మళ్ళీ కోరిక కోరుకోమనడంతో ప్రహ్లాదుడు " మిమ్మల్ని ఎప్పుడూ ఏ కోరికా కోరకుండా ఉండేలానూ, నా మనస్సులో ఏ కోరికా కలగకుండా ఉండేలానూ వరమివ్వండి " అని కోరుకున్నాడు.
స్వామి ముగ్ధుడయి ప్రహ్లాదుడిని ఓ మన్వంతరంపాటు భూలోకానికి చక్రవర్తిని చేసారు.
భక్తులకు కావలసినది ఏమిటో, ఏమి అనుగ్రహించాలో అమ్మవారికి తెలియదా.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment